
భూపాలపల్లి రూరల్, వెలుగు: మెషీన్లను వినియోగాన్ని పెంచి నిర్దేశిత బొగ్గు లక్ష్యాలను సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. గురువారం ఆయన భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ బొగ్గు గనుల్లో పర్యటించి సమస్యలపై కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు తప్పనిసరిగా ఎనిమిది గంటలు విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధనకు కృషి చేయాలని, పనిలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ఆయన వెంట సత్యనారాయణ (ఈఅండ్ ఎమ్ డైరెక్టర్), ఎల్ సూర్యనారాయణ (ఆపరేషన్స్ డైరెక్టర్), కొప్పుల వెంకటేశ్వర్లు ( ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్), భూపాలపల్లి ఏరియా జీఎం ఎ.రాజేశ్వర్ రెడ్డి, సీపీపీ జీఎం మనోహర్, ఆఫీసర్లు ఉన్నారు.