సింగరేణిలో 8 గంటలు పని మస్ట్ : సీఎండీ బలరాం

సింగరేణిలో 8 గంటలు పని మస్ట్ :  సీఎండీ బలరాం
  • రోజుకు 2.50 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయాలి 
  • ఏరియా జీఎంలకు సీఎండీ బలరాం ఆదేశాలు 

హైదరాబాద్​, వెలుగు : సింగరేణిలో ప్రతి ఒక్కరూ 8 గంటలు పని మస్ట్ గా చేయాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎండీ బలరాం ఆదేశించారు.  బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు అన్ని ఏరియాలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. మంగళవారం అన్ని ఏరియాల జీఎంలతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏడాది టార్గెట్ లో మిగిలిన120 రోజుల్లో ప్రతి నిమిషం విలువైందని, ఉత్పత్తి చాలా కీలకమైందని, లేట్ గా పనులు చేపట్టకుండా గని మేనేజర్, ప్రాజెక్టు అధికారి చొరవ తీసుకోవాలని సూచించారు. పెరిగిన విద్యుత్ డిమాండ్​దృష్ట్యా  థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయాల్సి ఉందన్నారు. ఇందుకు రోజుకు16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాలన్నారు.

ఉదయం 7 గంటల వరకు అందరూ గనుల వద్దకు చేరుకుని కార్మికులకు దిశానిర్దేశం చేయాలని స్పష్టం చేశారు. మెషీన్ల పనితీరు మెరుగుపరచాలని, కనీసం18 గంటలు వినియోగించుకోవాలన్నారు. కొత్త ప్రాజెక్టులైన కొత్తగూడెంలోని వీకే ఓసీ, ఇల్లందులోని రొంపేడ్ ఓసీలో వచ్చే మూడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఒడిశా నైనీ బ్లాక్ లో  చెట్ల లెక్కింపు కొంత పూర్తైనందున బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు, వెంకటేశ్వరరెడ్డి, జీఎంలు సుభాని,  డి.రవిప్రసాద్, కార్పొరేట్ జీఎంలు, ఏరియా జీఎంలు పాల్గొన్నారు.