హైపవర్ కమిటీ వేతనాల చెల్లింపు కోసం సబ్ కమిటీ
గోదావరిఖని, వెలుగు: సింగరేణితో పాటు కోల్ ఇండియాలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ సూచించిన వేతనాలు చెల్లించడంతో పాటు బోనస్ కూడా ఇవ్వాలన్న డిమాండ్‌పై చర్చించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సబ్ కమిటీలో ఆయా సంస్థల అధికారులతో పాటు కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జేబీసీసీఐ 11వ స్టాండర్డైజేషన్ కమిటీ మీటింగ్ కోల్ ఇండియా (పర్సనల్) డైరెక్టర్ వినయ్ రంజన్ అధ్యక్షతన జరిగింది.
ఇందులో జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి, కోల్ ఇండియా నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మీటింగ్‌లో చర్చించిన పలు అంశాలను ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి.సీతారామయ్య, బీఎంఎస్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య ఓ ప్రకటనలో తెలిపారు. జేబీసీసీఐ ఒప్పందం ప్రకారం అలవెన్స్‌లు, సెలవులు, సామాజిక భద్రత, ఎల్‌టీసీ, ఎల్‌ఎల్‌టీసీ, దివ్యాంగ ఉద్యోగి వెహికల్ అలవెన్స్ తదితరాలను అమలు చేసేందుకు వారంలోగా జీఓ జారీ చేయడానికి అంగీకరించారని వారు పేర్కొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు, వార్షిక బోనస్‌ను త్వరలో చెల్లిస్తారని, గతంలో లాగానే సీపీఆర్ ఎంఎస్ స్కీం కింద హాస్పిటళ్లలో చికిత్స పొందేందుకు భార్యాభర్తలకు ఏటా రూ.50 వేలు చెల్లించడానికి త్వరలోనే ఆఫీస్ ఆర్డర్ జారీ చేయనున్నారని వెల్లడించారు. అలాగే డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కోసం జాయింట్ కమిటీ ఏర్పాటు చేయనున్నారని, దీనికి సంబంధించిన విధివిధానాలను తయారు చేయనున్నారని చెప్పారు.
సింగరేణిలో కానీ, కోల్ ఇండియాలో కానీ మిగిలిపోయిన క్వార్టర్లను వసతి కోసం రిటైర్డ్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులకు కేటాయించేందుకు కమిటీని ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారని వారు వివరించారు.