సింగరేణితో జాతికి వెలుగులు

సింగరేణితో జాతికి వెలుగులు
  • సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్​ఏరియాల జీఎంలు
  • సుస్థిరాభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు
  • 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి టార్గెట్​
  • ఘనంగా 136వ ఆవిర్భావ వేడుకలు
  • ప్రగతి స్టాల్స్ ప్రారంభం

కోల్​బెల్ట్/నస్పూర్/ఆసిఫాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో జాతికి వెలుగులు పంచుతోందని, కంపెనీ సుస్థిరాభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోందని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల జీఎంలు అన్నారు. 136వ సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఆయా ప్రాంతాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. 

మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ లో, శ్రీరాంపూర్ లోని​ప్రగతి స్టేడియంలో, బెల్లంపల్లిలోని గోలేటీ భీమన్న స్టేడియంలో నిర్వహించిన వేడుకలను జీఎం దేవేందర్–స్వరూపరాణి, ఎల్వీ సూర్యనారాయణ, ఎం.శ్రీనివాస్–ఉమారాణి దంపతులు ప్రారంభించారు. సింగరేణి జెండాను ఆవిష్కరించి ఎస్అండ్​పీసీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కేక్​కట్ చేసి సంబురాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 

ప్రపంచ దేశాలకు దీటుగా..

జీఎంలు మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గు పరిశ్రమల్లోని అన్ని గనులకు దీటుగా సింగరేణి సంస్థ పనిచేస్తోందని అన్నారు. 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగల సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతోందన్నారు. సింగరేణి సంస్థ నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు టార్గెట్​ను సాధించాలని పిలుపునిచ్చారు. 

బొగ్గు వెలికితీసే స్థాయి నుంచి ప్రపంచ దేశాలతో దీటుగా అత్యాధునిక యంత్రాలను ఉపయోగించే స్థాయికి సింగరేణి చేరడం అది శ్రమతోనే సాధ్యమైందన్నారు. బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా చుట్టుపక్కల గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 232 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. త్వరలోనే 500 మెగావాట్లకు చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 

కొత్తగా ఏడు గనుల కోసం..

కొత్తగా ఏడు గనులను ప్రారంభించేందుకు పర్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు జీఎంలు పేర్కొన్నారు. థర్మల్, సోలార్, పంప్డ్ స్టోరేజీ, జియో థర్మల్ ​ప్రాజెక్టుల ఏర్పాటు, గ్రీన్ ​హైడ్రోజన్, అమ్మోనియం నైట్రేట్​తయారీ, కార్బన్​డైఆక్సైడ్ ​నుంచి మిథనాల్ఉత్పత్తికి చర్యలు చేపట్టనున్నట్లు జీఎంలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సింగరేణి కల్పిస్తోందన్నారు.

బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర రైతాంగానికి, పారిశ్రామిక రంగానికి వెన్ను దన్నుగా నిలుస్తోందని పేర్కొన్నారు. సింగరేణి డేను పురస్కరించుకొని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి, సంక్షేమం, టెక్నాలజీ, ఆరోగ్యం, సింగరేణి రెస్క్యూ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్​ ఆకట్టుకున్నాయి. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

పలు చోట్ల వేడుకలు

సింగరేణితో వేల కుటుంబాలకు ఉపాధి లభించిందని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఈడీ ఎన్వీ రాజశేఖర్ రావు అన్నారు. ఆవిర్భావ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జీఎం శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ బస్టాండ్​ఆవరణలోని సింగరేణి కార్మికుడి విగ్రహం వద్ద సింగరేణి కార్మిక బిడ్డల సంఘం ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. విగ్రహనికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేశ్ నాయకులు బింగి సదానందం, కాటం రాజు, ఉదురుకోట నరేశ్, సల్లం ప్రజ్వల్, గడ్డం తేజ తదితరులు పాల్గొన్నారు.