- రూ. 398కోట్ల పనుల్లో ఆఫీసర్ల నిర్లక్ష్యం
- సింగరేణికి రూ.కోటికి పైగా అదనపు భారం
- పగుళ్లతో కోల్‌ను స్టాక్ చేసుకోలేని దుస్థితి
భద్రాద్రికొత్తకొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో కొందరు ఆఫీసర్ల అవినీతి, నిర్లక్ష్యం వల్ల సంస్థకు నష్టాలొచ్చే పరిస్థితి నెలకొంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలా పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్ ఓసీలో రూ. 398కోట్లతో నిర్మించిన కోల్ బంకర్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో క్వారీ నుంచి బొగ్గును లోడింగ్ పాయింట్ వద్దకు తీసుకొచ్చే కన్వేయర్ బెల్ట్బ్రేక్ డౌన్అయితే ట్రాన్స్‌పోర్టు పూర్తిగా ఆగిపోనుంది. పిల్లర్లను రిపేరు చేసేలోగా ట్రాన్స్పోర్ట్ ఆగకుండా ఆఫీసర్లు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల సంస్థపై అదనంగా రూ. కోటి భారం పడనుంది.
మూడు బంకర్ల పిల్లర్లకు పగుళ్లు
బొగ్గు ట్రాన్స్‌పోర్టు మెరుగ్గా చేసేందుకు 2022మేలో జేవీఆర్ ఓసీ ప్రాంతంలో రూ. 398కోట్లతో కోల్ బంకర్లు, కన్వేయర్ బెల్ట్స్తదితర పనులు ప్రారంభించారు. మూడు బంకర్లు నిర్మించి ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసే ఈ పనులను సమంతా అనే కంపనీ టెండర్ ద్వారా దక్కించుకుంది. క్వారీ నుంచి వచ్చే బొగ్గును గ్రేడ్లవారీగా బంకర్లలో నిల్వ చేయాలని ప్లాన్ చేశారు. రెండో బంకర్లో గతఏడాది జూలైలో పగుళ్లు ఏర్పడ్డాయి. నవంబర్‌లో మొదటి బంకర్లో, రెండు వారాల కింద మూడో బంకర్ పిల్లర్లకు పగుళ్లు పడ్డాయి.
ఈ బంకర్ల నిర్మాణం విషయంలో సింగరేణి సివిల్ ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడంవల్లనే నాసిరకం పనులు జరిగాయంటున్నారు. 25ఏండ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉండాల్సిన బంకర్లు రెండున్నరేండ్లకే పగుళ్లు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సివిల్ వర్క్ చేసిన కంపనీ కనీసం 3 నుంచి 5ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యత చూసుకోవాలి.
కానీ, సమంతా కంపనీతో సింగరేణి కేవలం ఏడాది మాత్రమే నిర్వహణ బాధ్యతలు చూసేలా అగ్రిమెంట్ చేసుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిజైన్‌లో పేర్కొన్నవిధంగా స్టీల్వాడలేదని, అందువల్లే పగుళ్లు ఏర్పడుతున్నాయంటూ ఐఐటీ రీసెర్చ్స్టూడెంట్స్ సర్వేలో తేలిందని అంటున్నారు.
సంస్థపై ఆర్థిక భారం : రైల్వే వ్యాగన్లు లోడింగ్ పాయింట్ వద్దకు వచ్చిన మూడు గంటల్లోపు లోడింగ్ జరగపోతే రైల్వేలకు సింగరేణి రూ. లక్షల్లో డ్యామరేజ్ చార్జీలు చెల్లించాల్సిఉంటుంది. ఈ జాప్యాన్ని నివారించేందుకే అధునాతనంగా కోల్ బంకర్లను నిర్మించింది. బంకర్లకు పగుళ్లు రావడంతో బొగ్గును అక్కడ నిల్వ చేయలేక డైరెక్ట్‌గా లోడింగ్చేస్తున్నారు.
ఈ హడావిడిలో గ్రేడింగ్‌ను పట్టించుకోకపోవడం వల్ల సంస్థకు నష్టం కలిగే అవకాశాలున్నాయి. బంకర్ల రిపేర్లకు సంబంధించి సమంతా కంపనీతో యాజమాన్యం ఇటీవల చర్చలు జరిపింది. రిపేర్లు జరిగే టైంలో కన్వేయర్ బెల్ట్ ద్వారా డైరెక్ట్‌గా వ్యాగన్లలోకి లోడింగ్జరిగేలా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు దాదాపు రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
అదే కంపెనీతో రిపేర్లు చేయిస్తాం
బంకర్లు నిర్మించిన సమంతా కంపెనీతోనే రిపేర్లు చేయిస్తాం. పగుళ్లపై ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపాం. అండర్ డిజైన్ వల్లనే బంకర్లకు పగుళ్లు వస్తున్నాయంటూ ఐఐటీ రీసెర్చ్ స్టూడెంట్స్ తమ రిపోర్టులో పేర్కొన్నారు.- సూర్యనారాయణ, జీఎం, సివిల్, సింగరేణి కాలరీస్ కంపనీ