
- కొత్తగూడెం కార్పొరేట్, ఏరియాల్లో రూ. 310 కోట్లతో పనులు
- ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం.. నాణ్యతకు తిలోదకాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కంపెనీలో రూ. కోట్లల్లో జరుగుతున్న సివిల్ వర్క్స్‌లో నాణ్యత కొరవడింది. ఓ వైపు క్వార్టర్ల నిర్మాణం జరుగుతుండగానే మరో వైపు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఆఫీసర్ల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యంగా మారింది.
రూ.310 కోట్లతో క్వార్టర్ల నిర్మాణం!
కొత్తగూడెం కార్పొరేట్, ఏరియాల్లో దాదాపు రూ. 310 కోట్లతో కొత్తగా క్వార్టర్ల నిర్మాణాలతో పాటు, రోడ్లు, డ్రైనేజీలు, క్వార్టర్ల రిపేర్లు కొనసాగుతున్నాయి. రైటర్ బస్తీలో ఓ వైపు క్వార్టర్ల నిర్మాణం జరుగుతుండగానే మరో వైపు పగుళ్లు ఏర్పడుతున్నాయి. కాంపౌండ్ వాల్ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న బీమ్ల్లో వైబ్రేటర్ వాడాల్సి ఉంది. ఆఫీసర్లు ఉన్న టైంలో వైబ్రేటర్వాడడం.. వారు వెళ్లిన తర్వాత కర్రనే వైబ్రేటర్గా చేసుకొని పనులు కానిస్తున్నారు. క్యూరింగ్ కూడా తూతూ మంత్రంగానే ఉంటుంది.
పిల్లర్లు వేసిన టైంలో పునాదుల కోసం తవ్వి వాటిని మట్టితో నింపాల్సి ఉన్నా క్వాలిటీ ప్రమాణాలు పాటించకుండా రాళ్లతో నింపేశారు. ఆఫీసర్లు పట్టించుకోలేదు. పట్టణంలోని ప్రకాశం స్టేడియం సెంటర్లో రూ. లక్షలతో వేసిన రోడ్డు నాలుగైదు నెలలకే రిపేరుకొచ్చింది. రైటర్ బస్తీలో పెట్రోల్ బంక్ సమీపంలో నిర్మిస్తున్న రోడ్డు వర్క్స్పరిస్థితి అలాగే ఉంది. కనీసం రోడ్డు మధ్యలో ఉన్న కరెంట్ స్తంభాలను కూడా తొలగించకుండా రోడ్లు వేస్తున్నారు. క్వార్టర్ల రిపేర్లలోనూ నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదు.
అభివృద్ధి పనులకు వినియోగించే ఇసుక విషయమై రికార్డుల్లో మాత్రం గోదావరి ఇసుకగా చూపుతూ వాడకం మాత్రం సమీపంలోని వాగుల్లోని ఇసుకను వాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ క్వాలిటీగా జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు..
అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు. పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. కాంట్రాక్టర్ నాణ్యతతో పనులు చేపట్టకపోతే నోటీసులు ఇస్తాం. వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు సైతం వెనుకాడబోం. సూర్యనారాయణ, జీఎం సివిల్, సింగరేణి కాలరీస్కంపెనీ.