సింగరేణిలో కాగితాలకే గ్రీవెన్స్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీలో గ్రీవెన్స్​డే మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ప్రస్తుతం కంపెనీ సీఎండీగా ఉన్న ఎన్.బలరామ్  డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో 2022లో కొత్తగూడెంలో గ్రీవెన్స్​డే కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత ఒకటి రెండు ఏరియాల్లో గ్రీవెన్స్​ పెట్టి మమ అనిపించారు. ఏడాదికి పైగా ఎక్కడా గ్రీవెన్స్​లు పెట్టలేదు. గతంలో పెట్టిన గ్రీవెన్స్​లలో వచ్చిన  అప్లికేషన్లు కూడా పరిష్కారానికి నోచలేదు. 

ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు

కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా అప్పట్లో డైరెక్టర్​ హోదాలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్​ గ్రీవెన్స్ డేకు శ్రీకారం చుట్టారు. గతంలో ఉన్న డైరెక్టర్లు కొందరు అప్పుడప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల వద్దకే పాలన అనేలా ఏరియాల వారీగా బలరాం మొదటి దశలో 2021 జులై 8న కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్లలో గ్రీవెన్స్​డే నిర్వహించారు. కార్మికులు, ఉద్యోగుల వద్ద నుంచి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడం, మరికొన్నింటిని పరిశీలించి పరిష్కరించేందుకు గ్రీవెన్స్​డే ఏర్పాటు చేశామని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఒక్కో ఏరియాలో గ్రీవెన్స్  డే ప్రోగ్రాం నిర్వహించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే తర్వాత కాలంలో మందమర్రి, గోదావరిఖని, భూపాలపల్లి ప్రాంతంలో నిర్వహించారు.

కార్మికులు, ఉద్యోగుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఎక్కువగా ట్రాన్స్​ఫర్స్, క్వార్టర్ల  అలాట్​మెంట్, మారు పేర్ల మార్పు, మెడికల్​ బోర్డులో అన్​ఫిట్, డేట్​ఆఫ్​ బర్త్​ మార్పు వంటి సమస్యలపై కార్మికులు అప్లికేషన్లు ఇచ్చారు. దాదాపు 500 నుంచి 700 వరకు అప్లికేషన్లు వచ్చాయి. గ్రీవెన్స్​లో తమ సమస్యలను నేరుగా డైరెక్టర్లకు చెప్పుకునే అవకాశం ఉందని  భావించి కార్మికులు ఎన్నో ఆశలతో దరఖాస్తులు ఇచ్చారు. అయితే వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 25 నుంచి 30 శాతమే పరిష్కారం అయ్యాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అప్లికేషన్లు తీసుకున్న ఆఫీసర్లు వాటి పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం తామిచ్చిన దరఖాస్తు ఏమైందో కూడా ఎవరూ చెప్పలేదని కార్మికులు వాపోతున్నారు. 

ఏడాదిన్నర కాలంలో గ్రీవెన్సే లేదు 

ఏడాదిన్నర కాలంలో సింగరేణి వ్యాప్తంగా ఎక్కడా గ్రీవెన్స్​ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఆర్భాటంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం అటకెక్కడంపై కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్​గా ఉన్న టైంలో గ్రీవెన్స్​ మొదలు పెట్టిన బలరాం.. ప్రస్తుతం కంపెనీ సీఎండీ అయినందున గా తిరిగి గ్రీవెన్స్​ను ప్రారంభించాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. 

సమస్యలు పరిష్కరించాలి : వాసిరెడ్డి సీతారామయ్య, గుర్తింపు సంఘమైన వర్కర్స్​ యూనియన్​ ప్రెసిడెంట్​  

గ్రీవెన్స్​ను మొదలు పెట్టినప్పుడు కార్మికులంతా తమ సమస్యల్లో కొన్నైనా పరిష్కారం అవుతాయని ఆశించారు. డైరెక్టర్​ను కార్మికులు నేరుగా కలిసే అవకాశం ఉండదు. ఈ క్రమంలో గ్రీవెన్స్​లో డైరెక్టర్​ను కలిసి తమ బాధలు చెప్పుకునే అవకాశం ఉండేది. గతంలో నిర్వహించిన గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయో తెలియదు. ఏడాదిన్నరకు పైగా ఈ కాwర్యక్రమం నిర్వహించడం లేదు. ఇప్పటికైనా గ్రీవెన్స్​ నిర్వహించడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎండీ చొరవ చూపాలి.