
కోల్‌బెల్ట్, వెలుగు: గడిచిన పదేండ్ల కాలంలో కొత్తగా ఒక్క గనిని ఏర్పాటు చేయలేదని సింగరేణి కాలరీస్వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జనరల్సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. కొత్త అండర్ గ్రౌండ్ బొగ్గు గనులపైనే , సింగరేణి మనుగడ ఆధారపడి ఉందని పేర్కొన్నారు. మంగళవారం మందమర్రిలోని సింగరేణి సీఈఆర్ క్లబ్లో నిర్వహించిన ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచి 9వ మహాసభకు ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
సింగరేణిలో లాభాలు, ఉత్పత్తి పెరిగినా అది టెంపరరీ మాత్రమేనని, కొత్త అండర్‌గ్రౌండ్ గనులు రాకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. బొగ్గు బ్లాక్‌ల వేలం పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త గనులను ప్రైవేటువాళ్లకు అమ్ముతుందని, సింగరేణిలో అండర్గ్రౌండ్మైన్లను రాష్ట్ర సర్కార్ మూసివేస్తూ ఓపెన్ కాస్ట్గనులను ప్రోత్సాహిస్తోందని మండిపడ్డారు. సింగరేణికి సంబంధించి వేల కోట్ల ఫండ్స్‌ను రాష్ట్ర సర్కార్వివిధ స్కీంల పేరుతో తరలించుకపోతుందన్నారు. సింగరేణి ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు, మందుల కొరత ఉందన్నారు. 11వ వేజ్‌బోర్డు 23 నెలల ఏరియర్స్ఆగస్టు జీతంతో కలిపి సెప్టెంబర్‌లో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బ్రాంచి కమిటీ ఎన్నిక
మందమర్రి బ్రాంచి ఏఐటీయూసీ యూనియన్నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సీతారామయ్య తెలిపారు. బ్రాంచి సెక్రటరీగా సలెంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్‌గా భీమనాధుని సుదర్శనం, అసిస్టెంట్సెక్రటరీ సొమిశెట్టి రాజేశం, జాయింట్‌సెక్రటరీ కంది శ్రీనివాస్, మైనింగ్ స్టాఫ్ సెక్రటరీ గొపతి సత్యనారాయణ, కాంట్రాక్ట్ వర్కర్స్సెక్రటరీ జెట్టి మల్లయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పెద్దపల్లి బానయ్య, గాండ్ల సంపత్, దినేశ్‌ను ఎన్నుకున్నారు. సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.వీరభధ్రయ్య, జిల్లా ప్రెసిడెంట్ఎండీ అక్బర్అలీ తదితరులు పాల్గొన్నారు.