కార్మిక కాలనీలకు రంగు నీళ్లు.. ఖనిలో తాగునీటికి గోస పడుతున్న కార్మికులు

  • ఇంటేక్‌‌వెల్‌‌లో పంపులకు నిత్యం రిపేర్లు 
  • భగీరథ నీటిని తీసుకోని సింగరేణి మేనేజ్‌మెంట్​ 
  • పైపులైన్లు వేసినా కార్మిక కాలనీలకు అందని తాగునీరు 
  • ఆర్వో ప్లాంట్లే ఆధారం 
  • మేనేజ్‌మెంట్‌పై కార్మిక కుటుంబాల ఆగ్రహం 

గోదావరిఖని, వెలుగు:  గోదావరి ఒడ్డునే ఉన్నా గోదావరిఖనిలోని సింగరేణి కాలనీలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. తాగునీటి సప్లై కోసం ఏర్పాటు చేసిన ఇంటేక్‌వెల్‌ నుంచి ఆర్జీ 1 ఏరియా గోదావరిఖని, ఆర్జీ 2 ఏరియా యైటింక్లయిన్‌‌ పరిధిలోని కార్మిక కాలనీలకు రంగు నీరు సప్లై అవుతోంది. నిత్యం ఇంటేక్‌వెల్‌లోని పంపులు నిత్యం రిపేర్లు కావడం, నదిలో ఏర్పాటు చేసిన ఇనిఫిల్ట్రేషన్‌‌ గ్యాలరీ సరిగా పనిచేయకపోవడంతో నీరు ఫిల్టర్‌‌ కాక ఎర్రటి బురద రంగులో సప్లై అవుతున్నాయి. ఈ నీరు తాగడానికి పనికిరాకపోవడంతో కార్మికులు ఆర్వో ప్లాంట్ల నుంచి తెచ్చుకుంటున్నారు.

ఇంటెక్‌వెల్ ​పంపులు నిత్యం రిపేర్లే.. 

ఆర్జీ1 ఏరియా, ఆర్జీ 2 ఏరియా యైటింక్లయిన్  ​కార్మిక కాలనీలకు తాగునీటిని సప్లై చేసేందుకు ఇంటేక్‌వెల్‌ ఏర్పాటు చేశారు. నదిలోని ఇనిఫిల్ట్రేషన్‌‌ గ్యాలరీ నుంచి నేరుగా రా వాటర్‌‌ ఇంటేక్‌వెల్‌ పంపించి అక్కడ శుద్ధి చేసి మోటర్ల ద్వారా పంప్‌‌హౌజ్‌‌కు తరలిస్తారు. అక్కడి నుంచి కాలనీలకు సప్లై చేస్తారు. ఇందుకోసం 190 హెచ్‌‌పీ సామర్థ్యం ఉన్న నాలుగు మోటర్లు ఏర్పాటు చేశారు. కానీ ఇందులో ప్రస్తుతం రెండు మోటర్లే పనిచేస్తున్నాయి. ఇటీవల ఒక మోటర్‌‌కు రూ.3లక్షలతో రిపేర్ ​చేయించారు. అది ఫెయిల్ ​కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. మరో మోటర్‌‌ రిపేర్‌‌లోనే ఉంది. గతేడాది గోదావరికి వచ్చిన వరదలతో నది లోపల ఉన్న ఇన్‌‌ఫిల్ట్రేషన్‌‌ గ్యాలరీల మూతలు ఎగిరిపోవడంతో పాటు గోడలు పగిలిపోయాయి. ఈక్రమంలో నీరు సరిగ్గా ఫిల్టర్‌‌ కాకపోవడంతో కాలనీలకు ఎర్రటి, బురద రంగులో నీళ్లు సప్లై అవుతున్నాయి. పూణే నుంచి నిపుణులను తీసుకువచ్చి గోడలు నిర్మించి, మూతలు సరిచేసినా అది సక్సెస్‌‌ కాలేదు. గ్యాలరీ గోడలకు మళ్లీ హోల్‌‌ పడింది. 

మిషన్‌‌ భగీరథ పైపులైన్లు వేసినా.. 

గోదావరిఖని, యైటింక్లయిన్‌‌ కాలనీలోని సుమారు 16 వేల కంపెనీ క్వార్టర్లు, 22 వేల వరకు ప్రైవేటు ఇండ్లు ఉన్నాయి. ఈ కాలనీలకు 20 ఎంఎల్‌డీల భగీరథ నీటిని సప్లై చేసేందుకు సింగరేణి.. రామగుండం బల్దియాతో ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం గోదావరిఖని శారదానగర్‌‌లోని వాటర్‌‌ ట్యాంక్‌‌ నుంచి  గంగానగర్ లోని  సింగరేణి ఫిల్టర్  బెడ్  వరకు  2019లో   రూ.2.60  కోట్లతో 2.3 కి.మీ. మేర పైపులైన్  నిర్మించారు. 

గంగానగర్ ఫిల్టర్ బెడ్  వద్ద, జీఎం ఆఫీస్, ఫైవింక్లయిన్  సమీపంలో ఇంటర్  జంక్షన్లు అమర్చారు.  అనంతరం అదే ఏడాది జూన్‌‌ 19న ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించారు.  అయితే నిత్యం గోదావరిలో నీరు నిల్వ ఉండడంతో ఇంటెక్‌‌వెల్‌‌ నుంచే నీటిని సప్లై చేయొచ్చని భావించి మిషన్‌‌ భగీరథ నీటిని తీసుకోవడానికి సింగరేణి మేనేజ్‌మెంట్ ​వెనక్కి తగ్గింది. కానీ నిత్యం ఇన్‌‌ఫిల్ట్రేషన్‌‌ గ్యాలరీల సమస్య, ఇంటేక్‌వెల్‌ లో మోటర్లకు రిపేర్లు వస్తుండడం కార్మిక కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. గతంలో ప్రతి రోజు సప్లై అయ్యే నీరు ప్రస్తుతం రెండు రోజులకోసారి చేసే వస్తోంది. బుధవారం 11వ డివిజన్​లో మహిళలు నిరసన తెలిపారు.

ఆర్వో ప్లాంట్లకు బారులు 

సింగరేణి కాలనీలకు సప్లై అవుతున్న తాగునీరు రంగుమారి వస్తుండడంతో కాచి చల్లార్చి తాగాలని మేనేజ్‌‌మెంట్‌‌ చెబుతోంది. ఆ నీటిని ల్యాబ్‌‌కు పంపిస్తున్నామని, కాచి చల్లార్చి తాగడం వల్ల ఎలాంటి హానీ జరగదని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ వాటిని చూస్తే తాగేలా లేకపోవడంతో కార్మికులు ఆర్వో ప్లాంట్లకు వెళ్లి వాటర్ ​తెచ్చుకుంటున్నారు.  

‘ఈ ఫొటోలోని బకెట్లలో ఉన్న రంగు నీరు సింగరేణి కాలనీలకు గోదావరి ఇంటేక్​వెల్​, పవర్‌‌హౌజ్‌‌ కాలనీలోని పంప్‌‌ హౌజ్‌‌ నుంచి సప్లై చేసినవి. ఇవి తాగడానికి పనికి రాకపోవడంతో ఇతర అవసరాలకు వాడుతున్నారు. దీంతో కాలనీవాసులు ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఇంట్లోనే చిన్నపాటి ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదీ గోదావరిఖనిలో కార్మిక కాలనీల్లోని తాగునీటి పరిస్థితి