కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థ ఈ ఏడాది నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టతరంగా మారింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 10 నాటికి 64.92 మిలియన్ టన్నులు వెలికి తీయాల్సి ఉండగా ఇప్పటివరకు 58.48 మిలియనె టన్నులు మాత్రమే తీసింది. మిగిలిన 42 రోజుల్లో ఇంకా 11.52 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది.
అందుబాటులోకి రాని కొత్త గనులు
సింగరేణిలో 18 ఓపెన్ కాస్ట్ మైన్లు, 23 అండర్‌గ్రౌండ్ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఆయా గనుల్లో 2023- –24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ టార్గెట్ గా పెట్టుకుంది. ఆర్థిక సంవత్సరం చివరినాటికి కొత్తగా అందుబాటులోకి వచ్చే ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీపీ, కొత్తగూడెం వీకే7 ఓసీపీ, ఇల్లందు ఏరియాలోని రొంపేడు ఓసీపీల నుంచి వెలికితీసే బొగ్గుతో టార్గెట్ చేరుకోవచ్చని ఆశించింది. కానీ ఫిబ్రవరి వచ్చినా ఇప్పటివరకు ఒక్క కొత్త మైన్ కూడా ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు ప్రతి నెలా ఉత్పత్తి టార్గెట్ ను చేరుకోలేకపోవడం మొత్తం లక్ష్యంపై ప్రభావం చూపుతోంది. వర్షాకాలంలో భారీ వానలతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడడంతో పాటు తుఫాన్, గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచార ప్రభావం పడింది.
ఉత్పత్తిపై మేడారం జాతర ప్రభావం
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి టార్గెట్ చేరుకోవడానికి మరో 42 రోజుల వ్యవధి ఉంది. ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 58.48 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధించింది. ఇంకా 49 రోజులు ఉన్నప్పటికీ 7 రోజులు వారాంతపు సెలవులు పోగా 42 రోజుల్లోనే మిగిలిన 11.52 మిలియన్‌టన్నుల బొగ్గును వెలికి తీయాల్సి ఉంది. అంటే రోజుకు కనీసం 2.74 లక్షల టన్నుల బొగ్గును బయటకు తీయాల్సి ఉండగా ప్రస్తుతం రోజుకు 2.25 లక్షల టన్నులు మాత్రమే వస్తోంది. మరోవైపు ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగనుంది. సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు తీర్చుకోవడానికి మేడారం వెళ్లనున్నారు.
దీంతో జాతర ప్రభావం కూడా బొగ్గు ఉత్పత్తిపై పడనుంది. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా టార్గెట్లు రీచ్ అయ్యేందుకు సింగరేణి యాజమాన్యం మల్టీ డిపార్ట్మెంట్కమిటీ మీటింగ్ లను నిర్వహిస్తోంది. ఇందులో సింగరేణి ఆర్థిక పరిస్థితి, బొగ్గు మార్కెట్, క్వాలిటీ బొగ్గు అవశ్యకత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఎన్.బలరాంనాయక్ సైతం తరచూ ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహిస్తూ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాలో వేగం పెంచేందుకు సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఉత్పత్తి పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా ఏరియాల జీఎంలను ఆదేశించారు. ఓవర్ బర్డెన్ తొలగింపు, కాంట్రాక్టర్లు నిర్దేశిత సంఖ్యలో యంత్రాలను అందుబాటులో ఉంచేలా చూడాలని చెప్పారు. సింగరేణి డైరెక్టర్లు సైతం ఆయా ఏరియాల్లో పర్యటిస్తూ ఉత్పత్తి పెంపుదలపై సూచనలిస్తున్నారు.
నాలుగు డివిజన్లలోనే 100 శాతం
సింగరేణి మొత్తంలో నాలుగు డివిజన్లు మాత్రమే 100 శాతం బొగ్గును ఉత్పత్తి చేశాయి. ఇల్లందు ఏరియా 116 శాతం, మణుగూరు ఏరియా 112, బెల్లంపల్లి ఏరియాలో 123, రామగుండం 3 ఏరియాలో 102శాతం ఉత్పత్తి సాధించాయి. రామగుండం-1 ఏరియా 96 శాతం, రామగుండం-2 ఏరియా 99 శాతం, కొత్తగూడెం ఏరియా 92 శాతం బొగ్గు ఉత్పత్తితో 100 శాతానికి చేరువలో ఉన్నాయి. మిగిలిన ఏరియాలు కూడా ఉత్పత్తిని పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాయి.