విశ్లేషణ: రిటైర్డ్‌ ఎంప్లాయీస్​పై సింగరేణి వివక్ష

కాలిన బొగ్గు నుంచి వచ్చిన  బూడిదకు ఉన్నంత విలువ లేదు సింగరేణి ఉద్యోగులకు. రిటైర్డ్ కోల్ ఇండియా, రిటైర్డ్‌  సింగరేణి బొగ్గు గని రిటైర్డ్‌ ఎంప్లాయీస్​ పరిస్థితి అమావాస్య చంద్రుని మాదిరి అయ్యింది. సీఎంపీఎస్​ (కోల్ మైన్స్‌ పెన్షన్‌ స్కీం) 1998 ఒప్పందం ప్రకారం సింగరేణిలో, కోల్ ఇండియా లోని బొగ్గు గని కార్మికులకు చివరి నెల వేతనం ఆధారంగా 25% పెన్షన్ చెల్లిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి పెన్షన్ సవరణ జరగాల్సి ఉండగా, 23 ఏండ్లు గడిచినా ఇంత వరకూ పెన్షన్ పెంచేందుకు తగిన చర్యలు తీసుకోలేదు. చాలామంది కార్మికులు నెలకు మూడు వందల నుండి వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ పెన్షన్​తో బతకడం ఎట్లా సాధ్యమవుతుందో పాలకులకే తెలియాలి. అదే విశ్రాంత అధికారులకు నెలకు రెండు పెన్షన్​లు ఇస్తున్నారు. పదవీ విరమణ చేసిన చివరి నెల ఆధారంగా 25% పెన్షన్ ఒకటి, మరొకటి ఎన్​పీఎస్​ ప్రకారం మరో పెన్షన్ ఇస్తున్నారు. ఇదేకాక గ్రాట్యుటీ విశ్రాంత అధికారులకు జనవరి 2016 నుంచి కార్మికులకు మార్చి 28, 2018 నుంచి చెల్లిస్తున్నారు. సింగరేణిలో ఒక నినాదం ఉంది ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యం ఒకటే గమనం అని. కానీ  పదవీ విరమణ చేసిన తర్వాత ప్రతి చెల్లింపులో కూడా వివక్ష కొనసాగుతోంది.

వైద్య సౌకర్యాలు ఎండమావులే..

సింగరేణి విశ్రాంతి ఉద్యోగులకు కల్పిస్తున్న వైద్య సౌకర్యాలు ఎండమావుల వంటివే.  ఈ ప్రాంతంలో ఉన్న ఏరియా దవాఖానాల్లో  జేబీసీసీఐ ఒప్పందంతో  రిటైర్డ్​ ఉద్యోగులకు నామమాత్రపు ఉచిత వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు.  చాలామంది విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం  ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలలో  నివాసం ఉంటున్నారు. ఈ దవాఖానాలకు మందుల కోసం ప్రతి నెల సుదూర ప్రాంతాల నుండి పోవాలంటే ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. చాలీచాలని పెన్షన్​తో కాలం సాగదీస్తూ ఆరోగ్యం  కూడా సరిగా సహకరించని పరిస్థితుల్లో చారానా కోడికి బారాన మసాల వంటిది ఈ వైద్య సౌకర్యం. విశ్రాంత ఉద్యోగి నుండి రూ. 40,000 కట్టించుకుని సీపీఆర్‌‌ఎంఎస్‌ ఎన్‌ఈ హెల్త్ కార్డులు భార్య భర్తలు ఇరువురికి కలిపి జీవిత కాలంలో ఎనిమిది లక్షలకు వైద్య సౌకర్యం పొందేందుకు ఇచ్చారు. ఎంపిక చేసిన కొన్ని దవాఖానాలలో వైద్యం పొందేందుకు వీలు కల్పించినారు. నిత్యం మెడికల్‌ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ ఎనిమిది లక్షలు ఎక్కడ సరిపోతాయి?  ఇందులో కూడా ఆయా దవాఖానాలు సరిగా స్పందించక అనేక కష్టనష్టాలకు గురిచేస్తున్నారు.

సొంత ఇండ్లు కట్టుకునేలా..

సింగరేణి సొమ్మును తెలంగాణ రాష్ట్ర నలుమూలలా ఆయా ప్రాంతాల అభివృద్ధికై వెచ్చిస్తున్నారు. రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌కు కూడ కొంత సొమ్ము కేటాయించి సుఖవంతమైన జీవనం గడుపుటకు తోడ్పడాలి. సింగరేణి అధికారులకు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇల్లు కట్టుకొనేందుకు స్థలాలు కేటాయించటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది, కానీ ఉద్యోగులకు స్థలాలు కేటాయింపుకు ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు. కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. సంస్థ లాభాల బాటలో నడుస్తున్నదంటే  దిగిపోయిన ఉద్యోగుల భాగస్వామ్యం కూడా ఉంటుంది.  తక్కువ పెన్షన్‌తో బతుకులు ఈడుస్తున్న రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వైద్య సౌకర్యాల సమస్యలు తీరాలంటే సింగరేణి లాభాల నుండి కొంత సహాయం అందించి,  పెన్షనర్ల జీవితాల్లో  వెలుగు నింపాలని ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్ర సీఎం కేసిఆర్ వేడుకొంటున్నాం.

ఏడాదికి మూడు లైఫ్‌ సర్టిఫికెట్లు..

రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ భార్యభర్తలు ఇరువురికీ కలిపి రూ. 25 లక్షలు వారి జీవిత కాలంలో వైద్య సౌకర్యం కోసం ఇచ్చారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమనం అని చెప్పే సంస్థకు అధికారి, ఉద్యోగి ఒక్కటే కదా! మరి ఎందుకు ఈ వివక్షో తెలియదు. రిటైర్డ్‌ ఆఫీసర్స్‌కు ఇదే కాక.. ప్రతి ఏటా మెడికల్‌ అలవెన్స్‌ నిమిత్తం ఏడాదికి రూ. 36,000 ఇస్తున్నారు. ఈ వైద్య సౌకర్యాలు పొందేందుకు సింగరేణి రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ ఏడాదిలో రెండుసార్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి.. ఇది కాక పెన్షన్ పొందడానికి మరోసారి లైఫ్ సర్టిఫికెట్ తప్పక తీసుకోవాల్సి వస్తోంది. అంటే ప్రతి రిటైర్డ్‌ ఎంప్లాయ్‌ తాను బతికి ఉన్నట్లు సంవత్సరంలో మూడుసార్లు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఒక జీవితం మూడు లైఫ్ సర్టిఫికెట్లు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌కు కల్పిస్తున్నట్లు ఉచిత వైద్యం సౌకర్యం సింగరేణి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌కి కూడా కల్పించాలని కోరుతున్నారు.
– దండంరాజు రాంచందర్ రావు, అధ్యక్షుడు, సింగరేణి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సంఘం