- షాపింగ్ కాంప్లెక్స్ లు, మల్టీప్లెక్స్ లు, పెట్రోల్ బంక్ ల నిర్మాణాలు
- పది పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుపైనా కసరత్తు
- వ్యాపార విస్తరణలో సంస్థ అధికారులు బిజీ
- సర్కార్ ప్రోత్సాహంతోనే అంటున్న సింగరేణి సీఎండీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి సంస్థ కమర్షియల్ ఇన్ కమ్ పెంచుకునేందుకు షాపింగ్‌కాంప్లెక్స్‌లు, మల్టీ ప్లెక్స్ ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. సింగరేణి వ్యాప్తంగా పది చోట్ల పెట్రోల్‌బంక్‌లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. బొగ్గు తవ్వకాలతో పాటు ఇటీవలి కాలంలో సింగరేణి ఇతరత్రా వ్యాపారాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మోడ్రన్ మల్టీ ప్లెక్స్ ల నిర్మాణాలకు ఎస్టేట్, సివిల్, సర్వే ఆఫీసర్లతో మేనేజ్ మెంట్ తెప్పించే పనిలో నిమగ్నమైంది.
కొత్తగూడెం, గోదావరిఖని ఏరియాల్లో..
ఇప్పటివరకు బొగ్గు తవ్వకం, అమ్మకాలకే పరిమితమైన సింగరేణి కాలరీస్కంపెనీ ప్రస్తుతం వ్యాపార విస్తరణపైనా ఫోకస్ చేసింది. ఇప్పటికే సోలార్ విద్యుత్ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇథనాల్తయారీపైనా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగూడెం, గోదావరిఖని ఏరియాల్లో భారీగా షాపింగ్ కాంప్లెక్స్ లు, మల్టీ ప్లెక్స్ ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కొత్తగూడెంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలపై సీఎండీ బలరామ్‌కు గతంలోనే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విన్నవించారు. కొత్తగూడెం టౌన్ ఎంజీ రోడ్‌లోని సింగరేణి పాత షాప్‌లను కూల్చివేసి, కొత్తగా రెండు ఫ్లోర్లతో షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మాణాలకు సంస్థ ప్లాన్ చేస్తోంది.
ఇదే క్రమంలో షాపింగ్ కాంప్లెక్స్సమీపంలో మల్టీ ప్లెక్స్ నిర్మాణాలపైనా ఫోకస్పెట్టింది. ఇందుకు సంబంధించి సర్వే ఆఫీసర్లతో సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్లు మాట్లాడి ప్లాన్లు రూపొందిస్తున్నారు. రైల్వే స్టేషన్‌సెంటర్ లోని సింగరేణి సూపర్బజార్స్థానంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇదే క్రమంలో గోదావరిఖనిలో మెయిన్ రోడ్, మెయిన్ చౌరస్తాల్లోని పాత క్వార్టర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లను కూల్చివేసి మోడ్రన్ షాపింగ్‌కాంప్లెక్స్, మల్టీ ప్లెక్స్ నిర్మించనుంది. వాటి ఏర్పాటుతో ఆయా టౌన్ లు మరింతగా అభివృద్ధి చెందే చాన్స్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
పది చోట్ల పెట్రోల్ బంక్‌లు
సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెం, భూపాలపల్లి, మందమర్రి, ఆర్జీ–1,2,3 ప్రాంతాల్లో పది చోట్ల పెట్రోల్‌బంక్‌ల నిర్మాణాలపై సంస్థ ఫోకస్ పెట్టింది. సింగరేణికి చెందిన ఖాళీ స్థలాల్లో పెట్రోల్‌బంక్‌లను ఏర్పాటు చేయడంపై కార్పొరేట్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ప్లాన్లు రూపొందిస్తున్నారు. ఆయిల్ కంపెనీలతో సింగరేణి అధికారులు చర్చిస్తున్నారు. టెండర్లను కూడా పిలువనున్నారు.
సీఎండీ ప్రత్యేక దృష్టి
సింగరేణి సంస్థను బలోపేతం చేసే క్రమంలో వ్యాపార విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టామని సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్డైరెక్టర్ ఎన్. బలరాం తెలిపారు. పెట్రోల్బంక్లతో పాటు తొలి దశలో కొత్తగూడెం, గోదావరిఖని ప్రాంతాల్లో మల్టీ ప్లెక్స్ లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుపై ప్లాన్లు రూపొందిస్తున్నా మని పేర్కొన్నారు. సింగరేణి అదనపు ఆదాయ వనరులపై దృష్టి పెట్టే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పారు.