ఈ ఏడాది సింగరేణి టార్గెట్ 76 ఎంటీల బొగ్గు:సీఎండీ

ఈ ఏడాది సింగరేణి టార్గెట్ 76 ఎంటీల బొగ్గు:సీఎండీ
  • తొలి 3 నెలల్లోనే ఎక్కువ తవ్వకాలపై ఫోకస్​ 
  • మెషీన్ల వాడకం, కార్మికుల గైర్హాజర్​పై నజర్ 
  • డైరెక్టర్లు, జీఎంలతో సీఎండీ వరుస రివ్యూలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి కంపెనీ 2025– -26 ఆర్థిక సంవత్సరానికి 76 మిలియన్​టన్నుల (ఎంటీ) బొగ్గు వెలికితీతకు భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది.  గతేడాది 72 మిలియన్​టన్నులకు 69.01 ఎంటీలు మాత్రమే సాధించింది.  టార్గెట్ చేరకపోవడంపై  సీఎండీ ఎన్​బలరాం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో ఆఫీసర్లతో వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ముందునుంచే ప్లాన్ రూపొందించుకుని రీచ్ కావాలని డైరెక్టర్లు, ఏరియాల జీఎంలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మెషీన్లను పూర్తిస్థాయిలో వాడుకోవడంతో పాటు కార్మికుల గైర్హాజర్ పైనా నజర్ పెట్టాలని ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన ఓపెన్​కాస్టుల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్​నెలల్లో వర్షాలు కురుస్తుండడం ప్రొడక్షన్​కు పెద్దఎత్తున నష్టం కలుగుతుంది. 

దీంతో ఏప్రిల్, మే, జూన్​ నెలల్లోనే టార్గెట్​కు మించి ఉత్పత్తి చేసేలా.. 3 నెలల్లో దాదాపు 20 –21 మిలియన్​టన్నుల బొగ్గును తవ్వాలని స్పష్టంచేశారు.  ఒడిశాలోని నైనీ ప్రాజెక్ట్​తో పాటు కొత్తగూడెంలోని వీకేఓసీ, ఇల్లెందులోని పూసపల్లి ఓసీలు త్వరలో  ప్రారంభం కానున్నాయి. ఒడిశాలోని నైనీ ప్రాజెక్ట్​ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 4 –5 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తుంది. 

కొత్తగూడెం మైన్స్ ది పెద్దన్న పాత్ర సింగరేణి సీఎండీ బలరాం

 సింగరేణిలో కొత్తగూడెం ఏరియా మైన్స్​పెద్దన్న పాత్ర పోషిస్తున్నాయని సీఎండీ ఎన్​. బలరాం పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియాలో మంగళవారం ఆయన పర్యటించారు. వీకేఓసీ ప్రారంభించే ప్రాంతాన్ని డైరెక్టర్లతో కలిసి పరిశీలించారు. త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలపై ఏరియా ఆఫీసర్లతో రివ్యూ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 144.18లక్షల టన్నులు ఉత్పత్తి చేసి, 162.39 లక్షల టన్నుల బొగ్గును ట్రాన్స్​పోర్టు చేసి కొత్తగూడెం ఏరియా రికార్డు సృష్టించిందని తెలిపారు.

 కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజును అభినందించారు. డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, జీఎంలు సూర్యనారాయణ, చింతల శ్రీనివాస్​, సాయిబాబా, సైదులు, రాధాకృష్ణ, తిరుమలరావు, ఎస్వోటూ జీఎం కోటిరెడ్డి, కె. సూర్యనారాయణరాజు ఉన్నారు.