- 7వ రోజు సమ్మె కొనసాగించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులు
పెద్దపల్లి జిల్లా: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు 7వ రోజు సమ్మె నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తా నుంచి సింగరేణి సివిల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి డిమాండ్లు నెరవేర్చాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని సింగరేణి కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు.
మంచిర్యాల జిల్లాలోనూ..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేపట్టారు. గత ఫిబ్రవరి నెలలో సమ్మె చేసినప్పుడు 30 శాతం జీతం పెంచుతామని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు అసలు డబ్బులే లేవని అంటోందని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి నిధులను వరదలు, మెడికల్ కాలేజీకి, సీఎస్ ఆర్ కు మళ్లిస్తున్న ప్రభుత్వం.... వివిధ సంస్థల నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలను పట్టించుకోవడం లేదన్నారు. వారం రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నా సింగరేణి యాజమాన్యం కానీ, ప్రభుత్వంకానీ స్పందించడం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు.