కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను యాజమాన్యం దోచుకుంటుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అనుబంధ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్టేట్జనరల్సెక్రటరీ ఎండి. అక్బర్అలీ ఆరోపించారు. సోమవారం మందమర్రిలోని సింగరేణి జీఎం ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోరుతూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో 33 వేల మందిపైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు.
కోలిండియా మాదిరి హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని, అప్పటి వరకు జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2022లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం అంగీకరించిన పలు డిమాండ్లను నేటికీ అమలు చేయడం లేదన్నారు. ఈఎస్ఐ వైద్య సౌకర్యం, మైన్స్ యాక్ట్ ప్రకారం ప్రతి కార్మికునికి సిక్ లీవ్స్, పండగ సెలవులు ఇవ్వాలన్నారు. అండర్ గ్రౌండ్ అలవెన్సు, గైర్హాజరు పేరుతో కార్మికుల నుంచి ఫైన్ విధించే విధానం రద్దు చేయాలన్నారు. ఓసీపీల్లో వోల్వో ఆపరేటర్లకు హైస్కేల్ వేతనం, నర్సరీ కార్మికులకు సీఎంపీఎఫ్ , లోన్స్ సౌకర్యం, ఖాళీగా ఉన్న క్వార్టర్లను కేటాయించాలన్నారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్‌కు అందజేశారు. కార్యక్రమంలో మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీలు సత్యనారాయణ, మల్లేశ్, ఇప్పకాయల లింగయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి జెట్టి మల్లయ్య, బోయపోతుల కొమురయ్య , రాజేశ్ యాదవ్ ,ఫిట్ కార్యదర్శి రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.