సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వాలి

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వాలి

ఒకే కుటుంబం-.. ఒకే కంపెనీ..- ఒకే విజన్ అని సింగరేణి సంస్థ ప్రముఖంగా చెప్పుకుంటున్నది.  తెలంగాణ రాష్ట్రంలో 6 జిల్లాలలో సింగరేణి విస్తరించి ఉన్నది. సింగరేణి కాలరీస్ సంస్థకు 140 ఏండ్ల గొప్ప చరిత్ర ఉంది. BIFRలోకి వెళ్లిన సింగరేణిని బతికించుకోవడమే కాకుండా దానిని 30 ఏండ్లుగా లాభాల బాటలో నడిపిస్తున్న గొప్పతనం చీకటి సూర్యులది. ప్రభుత్వరంగ సంస్థలలో గత 30 ఏండ్లుగా వరుసగా వేల కోట్ల రూపాయల లాభాలను సాధించి ఆ లాభాల నుంచి గత సంవత్సరం 32 శాతం పర్మినెంట్​ కార్మికులకు బోనస్​గా చెల్లించారు.  

దేశవ్యాప్తంగా  సింగరేణి ఉత్పత్తిలో ముందుండి అనేక అవార్డులు, ప్రశంసలు అందుకొంటున్నది. అనేక రాష్ట్రాలకు సింగరేణి సంస్థ నల్ల బంగారాన్ని సప్లయ్ చేస్తూ దేశానికి  వెలుగు అందిస్తున్నది.  సింగరేణి సంస్థలో 51శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా,  49 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాలు ఉన్నాయి.  సింగరేణి కంపెనీలో 39వేల మంది పర్మినెంటు కార్మికులు పనిచేస్తుండగా మరో 30వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.  

సింగరేణిలో సాధారణ పనులతో పాటు అత్యంత కీలకమైన భూగర్భ గనులు, ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి చేయడంతోపాటు ఆ బొగ్గును రవాణా చేసేవరకు అన్ని పనులు నేడు కాంట్రాక్టు కార్మికులతో చేయిస్తున్నారు. బోనస్​ డిమాండ్​తో కార్మికుల ఆందోళనలు2023–-24 వార్షిక సంవత్సరం మార్చినాటికి  పూర్తయి 5 నెలలు దాటింది.  సింగరేణి  సంస్థకు వచ్చిన వార్షిక లాభాలను ఇంకా ప్రకటించలేదు.  సింగరేణిలో అన్ని విభాగాలను సాంకేతికరించి ముందడుగు వేస్తున్నప్పటికీ వార్షిక ఆదాయం,  ఖర్చు, మిగులును  తేల్చడానికి సుమారు అర్ధ సంవత్సరం తీసుకున్నా ఇంకా ప్రకటించలేదు.

 ఇది యాజమాన్యం ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నది.  సింగరేణిలో ఇప్పటికే లాభాలను ప్రకటించాలని బోనస్​గా 35 శాతం ఇవ్వాలని డిమాండ్ తో కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు.  సింగరేణి  కార్మిక సంఘాల డిమాండ్ పట్ల  యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని విడనాడి కార్మికులు కోరుతున్నట్లు లాభాల బోనస్​ చెల్లించాలి.  కంపెనీలో బొగ్గు ఉత్పత్తితో మొదలు అమ్మకం దాకా అన్ని పనులు చేస్తున్నా..30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కష్టం కూడా కంపెనీలో లాభాలు రావడానికి కారణంగా ఉంది.  

సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులలో అధికులు గతంలో  సింగరేణిలో పనిచేసి తమశక్తిని సంస్థ ఉన్నతికి ధారపోసి దిగిపోయిన మాజీ కార్మికుల బిడ్డలు, వారి కుటుంబీకులు, తెలంగాణా బిడ్డలు, భూములు కోల్పోయిన నిర్వాసితులే ఉన్నారు. అందువల్ల పర్మినెంటు కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు బోనస్​ చెల్లించాలి.  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సర్కారు సత్వరమే  స్పందించి లాభాలను ప్రకటించాలని,  సింగరేణి యాజమాన్యంకు ఆదేశాలు ఇవ్వాలని సింగరేణి కార్మిక సంఘాలు కోరుతున్నాయి. లాభాల నుంచి కార్మికులకు 35 శాతం బోనస్, కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం బోనస్​ను  సీఎం రేవంత్​రెడ్డి  ప్రకటించి అమలు చేయించాలి.

సమస్యలను పరిష్కరించి.. న్యాయం చేయాలి

-2023 అసెంబ్లీ  ఎన్నికల  సందర్భంగా కాంగ్రెస్​పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలను ఇచ్చింది.  సింగరేణిలో సంక్షేమానికి, అభివృద్ధికి,  భద్రతకు పటిష్టచర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.  నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్​  ప్రభుత్వంపై ఉంది.  సింగరేణికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కనయా పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేనేలేదు. తమ మీద ఎంత మాత్రమూ  భారం పడని హామీలు అమలు చేయడానికి వెనుకాడకుండా వెంటనే అమలు చేసేందుకు రేవంత్​రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

 ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ రక్షణ చట్టాలను గాలికి వదిలేసిన ఫలితంగా 17 మంది కార్మికులు సజీవంగా దగ్ధమైన ఘోర ప్రమాదం ఇటీవల జరిగింది. ఈనేపథ్యంలో నల్ల బంగారాన్ని వెలికితీయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ముందుండే కార్మికులకు రక్షణ చట్టాలను అమలు చేయడంలో ఎటువంటి జాప్యం చేయడం తగదు.  యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల అనేకమంది ప్రాణసంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు.  తమ విలువైన ప్రాణాలను అర్పించి సింగరేణిని లాభాల బాటలో  నడిపించే కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేయాలి. కాంట్రాక్టు కార్మికుల త్యాగాలకు తగిన పారితోషికం చెల్లించాలి.  

సింగరేణి సంస్థకు వస్తున్న లాభాల నుంచి కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి బోనస్​గా  ప్రకటించి పర్మినెంటు కార్మికులకు చెల్లిస్తున్నారు. సింగరేణి లాభాలు ఆర్జించడంలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ కూడా తోడై ఉన్నందున వారికీ బోనస్​ చెల్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్​  రెడ్డి చొరవ తీసుకోవాలి. ఈ మేరకు ప్రకటన చేసి సంస్థలోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు బోనస్​ చెల్లించేవిధంగా యాజమాన్యాన్ని ఆదేశించాలి. దీంతో 30 వేల మంది దళిత, గిరిజన,  నిరుపేద కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు  న్యాయం చేసినట్లు అవుతుంది.


- జె. సీతారామయ్య, 
ఐఎఫ్​టీయూరాష్ట్ర ఉపాధ్యక్షుడు