పెద్దపల్లి జిల్లా : గత 18 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను సింగరేణివ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు విరమించారు. 18 డిమాండ్లలో 16 డిమాండ్లను సింగరేణి యజమాన్యం అంగీకరించడంతో సమ్మెను విరమించామని కార్మిక జేఏసీ వెల్లడించింది. ప్రధానంగా కార్మికుల జీతాల పెంపుతో పాటు బోనస్ పై యాజమాన్యం కమిటీ వేసిందని తెలిపింది. జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యంతో లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని పలు కార్మిక సంఘాలు ఆరోపించాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని ఐఎఫ్టీయూ నాయకులు పిలుపునిచ్చారు.
వేతనాల పెంపుతో పాటు పలు అంశాలపై ఫిబ్రవరి 9న యాజమాన్యం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9 నుంచి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెచేశారు. సింగరేణి సంస్థలో సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు 50 రకాల పనులు చేస్తున్నారు. కొన్ని మైన్స్లలో పర్మినెంట్ కార్మికులు చేసే పని కూడా ఔట్ సోర్సింగ్ కార్మికులతో చేయిస్తున్నారు. సింగరేణి సాధిస్తున్న లాభాల్లో పరోక్షంగా భాగస్వాములవుతున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.