లోన్ రావాలంటే.. ముడుపులు ఇవ్వాల్సిందే! 

లోన్ రావాలంటే.. ముడుపులు ఇవ్వాల్సిందే! 
  •  సింగరేణి క్రెడిట్​సొసైటీల్లో అవినీతి, అక్రమాలు
  •  రూ. కోట్లలో టర్నోవర్.. రూల్స్ కు బ్రేక్!
  •  ఇష్టానుసారంగా చైర్మన్, డైరెక్టర్ల లావాదేవీలు
  • ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన డీసీఓ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలోని క్రెడిట్​కో – ఆపరేటివ్​సొసైటీలు అక్రమాలకు అడ్డాగా మారాయి.  పలు సొసైటీలు రూ. కోట్లలో టర్నోవర్​తో నడుస్తుండగా.. వీటికి వడ్డీ వ్యాపారమే ప్రధానంగా ఉంది.  కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్​హెడ్డాఫీస్​క్రెడిట్​సొసైటీతో పాటు ఎస్ అండ్​పీసీ క్రెడిట్​సొసైటీల్లోనూ అవినీతిపై కొద్దిరోజుల కింద పలువురు డిస్ట్రిక్ట్​ కో – ఆపరేటివ్​ సొసైటీ ఆఫీసర్లతో పాటు డీఎస్పీకి కంప్లయింట్ చేశారు. ఆయా సొసైటీల్లోని అక్రమాలపై డీసీఓ ఎంక్వైరీకి ఆదేశించారు. 

డైరెక్టర్ కంప్లయింట్ తో అక్రమాలు బయటకు..

సింగరేణి వ్యాప్తంగా పలు మైన్స్​, డిపార్ట్​మెంట్స్​లో కార్మికులు, అధికారులు మెంబర్లుగా క్రెడిట్​సొసైటీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో క్రెడిట్​సొసైటీలో 150 –300 మంది సభ్యులుగా ఉంటారు. ఒక్కో సభ్యుడు నెలకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు సొసైటీల్లో జమ చేస్తుంటారు. అవసరమైనప్పుడు లోన్​గా తీసుకుంటారు. ఇందుకు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. జమ చేసిన సభ్యులకు ప్రతి ఏడాది ఆడిట్​తర్వాత డివిడెంట్​గా కొంత మొత్తాన్ని వాటాలుగా ఇస్తుంటారు.

ఇలా పలు సొసైటీలు డిపాజిట్లను ప్రోత్సహిస్తుండడం గమనార్హం. కొత్తగూడెంలోని ఎస్​అండ్​పీసీ క్రెడిట్​ కో – ఆపరేటీవ్​సొసైటీ రూ. 11కోట్లకు పైగా, హెడ్డాఫీస్​క్రెడిట్​కో ఆపరేటీవ్​సొసైటీ రూ. 6 కోట్లకుపైగా టర్నోవర్​తో నడుస్తున్నాయి. సాధారణం గా ఏయే డిపార్ట్​మెంట్లలో పనిచేస్తున్నారో అందులోని ఉద్యోగులే మెంబర్లుగా ఉంటారు. సొసైటీ చైర్మన్​తో పాటు సభ్యులం తా కలిసి కొందరు డైరెక్టర్లను ఎన్నుకుంటారు.  మెంబర్లు పిల్లల చదువులు, పెండ్లిలు, ఇంటి నిర్మాణాలకు రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు లోన్​తీసుకుంటారు.

బ్యాంకుల కన్నా అధిక వడ్డీ వస్తుండడంతో పాటు తాము జమ చేసిన డబ్బులకు భరోసా ఉండడంతో సింగరేణి క్రెడిట్​సొసైటీల్లో డిపాజిట్​చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు.  కొన్ని సొసైటీల్లో టర్నోవర్​పెంపే లక్ష్యంగా నగదు జమలకు ఇతర డిపార్ట్​మెంట్ల కు చెందిన వారిని ప్రోత్సహిస్తున్నారు.  అయితే.. రూల్స్ కు విరుద్ధంగా మెంబర్లను చేర్చుకోవడం, డిపాజిట్లు సేకరించడం, లోన్​ పూర్తిస్థాయిలో రీ పేమెంట్​కాకుండానే తిరిగి లోన్లు ఇస్తుండడంపై సొసైటీల్లో సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయి.
 
లావాదేవీల్లో తేడాలతో తలెత్తిన లొల్లి

సింగరేణి హెడ్డాఫీస్​ కో ఆపరేటీవ్​సొసైటీ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఓ డైరెక్టర్​డిస్ట్రిక్ట్​కో ఆపరేటీవ్​ ఆఫీసర్​కు గతనెల 17న ఫిర్యాదు చేశారు. సొసైటీ లావాదేవీలు, మెంబర్ల జాబితా, డిపాజిట్​దారుల వివరాలు, విత్​డ్రా డిపాజిట్​దారులు, ఖర్చులు, సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్​లు వంటి పలు అంశాలపై ఎన్నిసార్లు అడిగినా వివరాలు ఇవ్వడం లేదని  ఆరోపించారు. ఇప్పటికే కార్పొరేట్​ఎస్​అండ్​పీసీ కో ఆపరేటీవ్​ క్రెడిట్​సొసైటీలో చైర్మన్, డైరెక్టర్ల మధ్య లావాదేవీల్లో తేడాలతో డైరెక్టర్ల మధ్య లొల్లి నడుస్తుంది.  

మెంబర్స్ కు  లోన్​ ఇచ్చేందుకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు కొందరు అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఓ డైరెక్టర్​ను పదవి నుంచి తప్పించడం సొసైటీ లో చర్చనీయాంశంగా మారింది. నాన్​మెంబర్ల డిపాజిట్లను రిటర్న్ చేయాలని పలుమార్లు డైరెక్టర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ పలువురు మెంబర్లు ఆరోపిస్తున్నారు.

ఈ సొసైటీలో గౌరవ సలహాదారులు, అధ్యక్షులుగా కొనసాగుతున్న వారే పెత్తనం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ సొసైటీలో ఇటీవల తలెత్తిన విభేదాలతో ఓ డైరెక్టర్ ​కొత్తగూడెం డీఎస్పీకి కంప్లయింట్ చేశారు. గతంలో ఇల్లెందులోని 21 ఇంక్లైన్​క్రెడిట్​ సొసైటీలోనూ భారీగా అక్రమాలు జరిగినట్ట ఉ ఆరోపణలు ఉన్నాయి.  కొందరి వద్ద నుంచి రికవరీకి గతంలో డీసీఓ అధికారులు ఆదేశించారు. దీనిపై విచారణ చివరి దశలో ఉందని ఆఫీసర్లు పేర్కొన్నారు. 

విచారణకు ఆదేశించాం


సింగరేణి​ హెడ్డా ఫీస్ ​క్రెడిట్​సొసైటీలోని ఒక డైరెక్టర్​ తమకు కంప్లయింట్ చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నా. కార్పొరేట్ ఎస్అండ్​ పీసీ క్రెడిట్ ​సొసైటీ లావాదేవీలపైనా విచారణ చేస్తాం. – ఖుర్షిద్, డీసీఓ ​