
- అనారోగ్యంతో హైదరాబాద్ గాంధీలో కన్నుమూత
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి డిస్మిస్డ్ కార్మిక సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బీరబోయిన రవీందర్(55) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆయన కొద్ది కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని యాపల్ సీఎస్పీ రోడ్ ఏరియాకు చెందిన రవీందర్.. సింగరేణి డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.
డిస్మిస్డ్ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామిల్ల రాయలింగు చనిపోయిన తర్వాత రవీందర్ 2014 ఫిబ్రవరి 9 నుంచి సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. మందమర్రి సింగరేణి జీఎం ఆఫీసు సమీపంలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఆయన ఆధ్వర్యంలో డిస్మిస్డ్ కార్మికులు 7,136 రోజులుగా రిలే దీక్ష శిబిరం నిర్వహిస్తున్నారు. సుమారు నెల రోజుల కిందట రవీందర్ సోదరుడు కుమారస్వామి అనారోగ్యంతో చనిపోయాడు. కాగా, రవీందర్ కూడా డిస్మిస్డ్ కార్మికుడే. ఆయన మృతిపై కాంగ్రెస్ లీడర్ రామిల్ల రాధికతో పాటు కార్మిక, రాజకీయ పార్టీలు సంతాపం ప్రకటించాయి. డిస్మిస్డ్ కార్మికుల కోసం రవీందర్ తన జీవితకాలం పోరాటం చేశారని పలువురు గుర్తుచేసుకున్నారు.