- వాయిదా వేయాలంటూ హైకోర్టుకు సింగరేణి
- విచారణ ఈనెల 11కు వాయిదా
- సర్కారు, యాజమాన్యం ఎన్ని కుట్రలు పన్నినా ఎన్నికలుఆగవంటున్న ఏఐటీయూసీ, బీఎంఎస్
- నామినేషన్లు వేస్తామని యూనియన్ లీడర్ల ప్రకటన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేర్కొనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై అటు కంపెనీ, ఇటు సర్కారు దోబూచులాడుతున్నాయి. అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సెంట్రల్ డిప్యూటీ లేబర్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు రంగంలోకి దిగారు. కంపెనీ యాజమాన్యం, యూనియన్లతో మీటింగ్ నిర్వహించిన అనంతరం గత నెల 27న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసి, ఈనెల 28న ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఎన్నికలను వాయిదా వేయాలంటూ సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో ఇరు పక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్ కేసును ఈనెల 11కువాయిదా వేసింది.
నామినేషన్లకు సిద్ధం
ఈసారి ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలు జరిగి తీరుతాయని ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాల నేతలు ధీమాగా చెప్తున్నారు. శుక్ర, శనివారాల్లో తాము నామినేషన్లు వేస్తామని ఈ రెండు యూనియన్ల లీడర్లు పేర్కొన్నారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సహా మిగిలిన 11 సంఘాల లీడర్లు మాత్రం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నారు. అటు యాజమాన్యం ఓటరు జాబితాలను యూనియన్లకు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సింగరేణిలో గుర్తింపుసంఘం ఎన్నికలపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఈ క్రమంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఆసక్తి నెలకొంది. కాగా, సింగరేణి తన తరుపున వాదించేందుకు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేకంగా అడ్వొకేట్ ను పిలిపించింది. దీన్నిబట్టి చూస్తే ఎన్నికలను ఆపేందుకు యాజమాన్యం తన సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు స్పష్టమవుతున్నది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏమైనా తేడా వస్తే తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఎఫెక్ట్ పడవచ్చని బీఆర్ఎస్ సర్కారు భావిస్తోంది. దీంతో యాజమాన్యంతో ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నదని ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలు ఆగవు: యూనియన్ లీడర్లు
గుర్తింపు సంఘం ఎన్నికలు ఆగే ప్రసక్తే లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. అధికార బీఆర్ఎస్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికలను వాయిదా వేయించేందుకు కుట్ర పన్నుతోందని వారు ఆరోపించారు. శుక్ర, శనివారాల్లో నామినేషన్లు వేసేందుకు ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాల తరుపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.