- రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 7 ఎల్‌ఈపీ మైన్ వద్ద ఘటన
గోదావరిఖని, వెలుగు : ఇసుక బంకర్‌ను పరిశీలించేందుకు వెళ్లిన సింగరేణి ఉద్యోగి బంకర్‌లో పడి చనిపోయాడు. ఈ ఘటన సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 7 ఎల్‌ఈపీ గని వద్ద మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... జీడీకే 7 ఎల్‌ఈపీ మైన్ నుంచి 2021లో బొగ్గు తవ్వకాలను నిలిపివేశారు. ఇక్కడ పనిచేసిన వారిని ఇతర మైన్లకు ట్రాన్స్‌ఫర్ చేయగా కేవలం 30 మందిని ఇతర పనులకు వాడుకుంటున్నారు. యైటింక్లయిన్ కాలనీలో ఉంటున్న తీట్ల సత్యనారాయణ (45) హెడ్ ఓవర్‌మెన్‌గా పనిచేస్తూనే అండర్ మేనేజర్ టెస్ట్‌లో ఫస్ట్ క్లాస్ సర్టిఫికెట్ పొందడంతో అతడికి ఇన్‌చార్జి మేనేజర్, సేప్టీ ఆఫీసర్‌గా అవకాశం ఇచ్చారు.
దీంతో అతడు ప్రతి రోజు గని వద్దకు వెళ్లి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసేవాడు. మంగళవారం ఉదయం గని పైకప్పులోని బంకర్‌లో పేరుకుపోయిన ఇసుకను తొలగించేందుకు మరో వర్కర్‌ను తీసుకెళ్లి పనిచేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఇసుక దిబ్బ మీద నిలబడడంతో అది ఒక్కసారిగా జారి సత్యనారాయణ బంకర్‌లో పడి ఇసుకలో కూరుకుపోయాడు. దీంతో ఊపిరి ఆడక చనిపోయాడు. విషయం తెలుసుకున్న సింగరేణి కార్పొరేట్ సేప్టీ జీఎం చింతల శ్రీనివాస్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్జీ 2 ఏరియా జీఎం వెంకటయ్య, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావుతో పాటు రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.
మూడు గంటల పాటు శ్రమించి బంకర్‌లో ఇసుకను తొలగించి సత్యనారాయణ డెడ్‌బాడీని వెలికితీశారు. ఘటనపై విచారణ జరిపి, రక్షణ చర్యలు చేపట్టని ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాగూర్, మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, కార్మిక సంఘాల నాయకులు వైవీ. రావు, మిర్యాల రాజిరెడ్డి, యాదగిరి సత్తయ్య, టి.రాజారెడ్డి డిమాండ్ చేశారు.
హెడ్ ఓవర్ మెన్ మృతి బాధాకరం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జీడీకే 7 ఎల్‌ఈపీ గని వద్ద జరిగిన ప్రమాదంలో హెడ్ ఓవర్‌మెన్ సత్యనారాయణ చనిపోవడం బాధాకరం అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల రక్షణకు మెరుగైన భద్రతాచర్యలు చేపట్టాలని సూచించారు.