మైనింగ్ బిజినెస్ లోకి సింగరేణి!

మైనింగ్ బిజినెస్ లోకి సింగరేణి!
  • వ్యాపార విస్తరణ దిశగా సంస్థ ఫోకస్
  • దేశ, విదేశాల్లోని ఖనిజాల తవ్వకాలపై స్టడీ
  • ప్రధానంగా లిథియం, బెరీలియంపై రీసెర్చ్  
  • టెక్నాలజీ సాయానికి హెచ్ ఐఐటీతో ఎంఓయూ
  • వచ్చే ఐదేండ్లలో ప్లాంట్​ఏర్పాటుకు నిర్ణయం

కోల్​బెల్ట్, వెలుగు:  మైనింగ్ తవ్వకాలపైనా ఫోకస్ చేసిన సింగరేణి ఆ దిశగా అడుగులు వేస్తోంది.  వ్యాపారాన్ని విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో క్రిటికల్​మినరల్స్, మైనింగ్​తవ్వకాలకు నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో, విదేశాల్లో లభించే ఖనిజాలపై దృష్టి పెట్టింది.  ప్రధానంగా లిథియం, బెరీలియం వంటి వాటిపై స్టడీ చేసేందుకు కన్సల్టెన్సీకి బాధ్యతలు కూడా అప్పగించింది. మరోవైపు రీసెర్చ్, టెక్నాలజీ సాయానికి వివిధ సంస్థలతోనూ ఎంఓయూలు కుదుర్చు కుంటుంది.

 మరోవైపు టికే జైపూర్​లోని థర్మల్​పవర్ ప్లాంట్​ఫ్లైయాష్​లో అరుదైన ఖనిజాలు ఉన్నట్లు గుర్తించింది. వీటిని కమర్షియల్​వాడకంపైనా కసరత్తు చేస్తోంది. ఖనిజాలు లభించే ప్రాంతాలపై స్టడీ చేస్తున్నట్లు సంస్థ సీఎండీ బలరాం పేర్కొన్నారు. ఇందుకు దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలతోనూ అగ్రిమెంట్లు చేసుకుంటున్నట్టు తెలిపారు. 

ప్రధానంగా లిథియం, బెరీలియంపై దృష్టి

రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీలో క్రిటికల్ మినరల్స్ ది కీలకపాత్ర. దీంతో సింగరేణి వీటిపై స్టడీ చేసేందుకు దృష్టిపెట్టింది. ఇప్పటికే డెలాయిట్, ప్రైస్​ వాటర్​ కూపర్స్​ వంటి సంస్థలతోనూ చర్చించింది.  ఇందులో ఒక దానికి స్టడీ కన్సల్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చింది. 

ఎలక్ర్టికల్​వెహికల్​బ్యాటరీల్లో లిథియం, ఎయిర్​క్రాప్ట్​డిస్క్​బ్రేక్​లు, అణ్వాయుధాలు, రియాక్టర్లు, శాటిలైట్​స్పేస్​వెహికల్స్​, ఎక్స్​రే ట్రాన్స్​మిషన్, రాకెట్, నావిగేషన్​ సిస్టమ్స్​వంటి వాటిలో ప్రధానంగా వినియోగించే బెరీలియం మెటల్ పైనా ఫోకస్ పెట్టింది. దీని నిల్వలు ఎక్కువగా ఆస్ర్టేలియా, చైనా, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా, రష్యా​ వంటి దేశాల్లో ఉన్నాయి. వీటి నిల్వలు, తవ్వకాలపైనా కన్సల్టెంట్​తోనూ స్టడీ చేయిస్తోంది. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇతర ఖనిజాలు కూడా ఎక్కడ లభిస్తాయనే దానిపైనా సింగరేణి దృష్టి సారించింది. 

ఎస్టీపీపీ ఫ్లై యాష్ లోనూ అరుదైన ఖనిజాల గుర్తింపు

మంచిర్యాల జిల్లా జైపూర్​లోని  సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​నుంచి వెలువడే ఫ్లై యాష్​లోనూ అరుదైన ఖనిజాలు ఉన్నట్లు ఇటీవల చేసిన టెస్ట్ ల్లో బయటపడింది. వీటిని కూడా వాణిజ్యపరంగా వాడుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైదరాబాద్ ఐఐటీని సింగరేణి కోరింది. రీసెర్చ్, టెక్నాలజీ సాయానికి ఎంఓయూ కూడా చేసుకుంది. మూడు రోజుల కిందట హైదరాబాద్​ఐఐటీ ప్రొఫెసర్ల టీమ్ తో సింగరేణి అధికారులు సమావేశమయ్యారు. 

క్రిటికల్ మినరల్స్, మైనింగ్ లో జాయింట్ రీసెర్చ్, డెవలప్ మెంట్ ప్రాజెక్టులపై చర్చించారు. ఆస్ట్రేలియాలో మోనాష్, న్యూ సౌత్ వేల్స్ వంటి ప్రముఖ యూనివర్సిటీలతో కూడా ప్రత్యేక అగ్రిమెంట్ చేసుకోవడం కూడా కలిసివస్తుందని సింగరేణి భావిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) లో వినియోగించే బ్యాటరీల్లోని కీలకమైన లిథియం ప్రాసెసింగ్​ప్లాంట్​ను వచ్చే ఐదేండ్లలోపు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. 

ALSO READ : కార్పొరేషన్​గా మహబూబ్​నగర్​

దేశంలోనే తొలిసారి మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్  

బొగ్గు నుంచి అమోనియం నైట్రేట్, మిథనాల్​ఉత్పత్తికి కూడా సింగరేణి ప్రత్యేక ప్లాంట్లను నిర్మిస్తోంది. ఇప్పటికే జైపూర్​థర్మల్​పవర్​ప్లాంట్​లో దేశంలోనే తొలిసారిగా కార్బన్​డయాక్సైడ్ నుంచి మిథనాల్​ను తయారు చేసే పైలెట్​ప్లాంట్​ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కిలోల కార్బన్​ డయాక్సైడ్​ను సేకరించి హైడ్రోజన్​వాయువుతో కుదింపు చేసి మిథనాల్ ను  తయారు చేయనుంది. ఇందుకు రూ.20 కోట్లతో బెంగళూరుకు చెందిన జవహర్​లాల్​నెహ్రూ సెంటర్​ఫర్​అడ్వాన్స్​డ్​సైంటిఫిక్​రీసెర్చ్, బ్రెత్​అప్లైడ్​సైన్సెస్​ప్రైవేటు లిమిటెడ్​ఆధ్వర్యంలో ప్లాంట్​నిర్మాణం పూర్తయింది. కొద్ది రోజుల్లోనే షురూ చేయనుంది.