భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : బొగ్గు ఉత్పత్తి టార్గెట్ రీచ్ అయ్యేందుకు సింగరేణి సంస్థ మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 45.36 మిలియన్‌టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 40.26 మిలియన్ టన్నులు మాత్రమే తీసింది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి ఇంటర్నల్‌గా 74 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని యాజమాన్యం నిర్దేశించుకుంది. అధికారికంగా 70 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో కోల్ ప్రొడక్షన్ భారీగా తగ్గింది. దీనికి తోడు ఓసీల్లో ఓవర్ బర్డెన్ పనులు అనుకున్న ప్రకారం జరగలేదు. అది కూడా ప్రొడక్షన్ తగ్గడానికి కారణమైంది. సరైన ప్రణాళికలు రూపొందించడంలో యాజమాన్యం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి.
వేర్వేరు కారణాలు..
ఒడిశాలోని నైనీ ప్రాజెక్ట్ లో ఈ ఏడాది 7,32,692 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు ఒక్క బొగ్గు పెళ్ల బయటికి రాలేదు. కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓసీలో సాంకేతిక, రక్షణ కారణాలతో 1.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాలేదు. మొత్తంగా యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా 40.26 మిలియన్‌టన్నుల బొగ్గును తీసి, 89 శాతంతో సరిపెట్టుకుంది. ఆర్జీ–1, మణుగూరు, ఆర్జీ–2 ఏరియాల్లో మాత్రమే వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి సాధించారు. ఓసీపీ(ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్)ల నుంచి 39.60 మిలియన్టన్నులకు గానూ 36.17 మిలియన్ టన్నులు, యూజీఎం(అండర్‌గ్రౌండ్ మైన్స్) నుంచి 57.65 లక్షల టన్నులకు 40.90లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు.
కార్మికుల్లో అసంతృప్తి
బొగ్గు ఉత్పత్తికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు కీలకంగా మారాయి. టార్గెట్ రీచ్ అయ్యేందుకు యాజమాన్యం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏమీ ప్రకటించకపోవడంతో కార్మికులు కొంత అసంతృప్తితో ఉన్నారు. మరో వైపు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ టైంలో ఎన్నికలు నిర్వహిస్తే బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగే అవకాశం ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టార్గెట్ రీచ్ అయ్యే దిశగా కంపెనీ డైరెక్టర్లు, ఏరియాల జీఎంలతో సీఎండీ శ్రీధర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.