బొగ్గు ఉత్పత్తిలో టార్గెట్ చేరుకోని సింగరేణి.. లక్ష్యానికి 3 అడుగుల దూరంలో..

 బొగ్గు ఉత్పత్తిలో టార్గెట్ చేరుకోని సింగరేణి.. లక్ష్యానికి 3 అడుగుల దూరంలో..
  • 2024–25 ఆర్థిక సంవత్సరానికి  72 మిలియన్ టన్నులు పెట్టుకోగా.. 69 మిలియన్ టన్నులే ఉత్పత్తి 
  • 65 మిలియన్ టన్నులకు పైగా  రవాణా.. గత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నులు వెలికితీత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ 69.02 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. 65 మిలియన్​టన్నులకుపైగా బొగ్గును వినియోగదారులకు ట్రాన్స్ పోర్ట్ చేసింది. 72 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి  లక్ష్యంగా పెట్టుకోగా కొత్త ప్రాజెక్ట్​లకు పర్మిషన్స్​లేట్ అయ్యాయి. దీంతో  రెండు ఏరియాల్లో లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు తీయలేకపోయింది. అయితే.. కొత్తగూడెం ఏరియా అత్యధికంగా కోల్ ప్రొడక్షన్,​ ట్రాన్స్​పోర్టు చేసి రికార్డు సృష్టించింది.

పర్మిషన్స్ రాకపోగా.. వర్షాలతో బొగ్గు తీయలేక..
సింగరేణి 72 మిలియన్​టన్నుల బొగ్గును తవ్వేందుకు 2024 -– 25 ఆర్థిక సంవత్సరానికి టార్గెట్​గా పెట్టుకుంది. కాగా..69.02మిలియన్​టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇది 2023–24 లో 70 మిలియన్​ టన్నులు, 2022–23లో 67.14 మిలియన్​టన్నులుగా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఒడిశాలోని నైనీ ప్రాజెక్ట్​తో పాటు కొత్తగూడెంలోని వీకే ఓసీ, ఇల్లందులోని పూసపల్లి(జేకే ఓసీ)కి పర్మిషన్స్​వస్తాయని సంస్థ ఆశించింది. 

అందుకనుగుణంగా ఆయా మైన్స్​ఉత్పత్తి చేసేందుకు టార్గెట్​గా నిర్దేశించింది. కానీ ఆ మూడు ఓసీలకు ఈసీ, ఇతరత్రా పర్మిషన్స్​రాలేదు. దీంతో టార్గెట్​చేరుకోలేదని యాజమాన్యం పేర్కొంటుంది. అంతేకాకుండా పలు ఓపెన్​కాస్టుల్లో టార్గెట్​మేరకు ఓవర్​బర్డెన్​(మట్టి పనులు)ను తీయకపోవడం, అధిక వర్షపాతం నమోదు కావడంతో బొగ్గు ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్న ఓసీల్లో బొగ్గు తవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

జేవీఆర్ కంపెనీలోనే ఎక్కువ 
సింగరేణి వ్యాప్తంగా అత్యధికంగా 144.18లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఇందులో కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్​ఓసీలోనే ఎక్కువగా 115లక్షల టన్నుల బొగ్గును వెలికితీసిన మైన్​గా ఘనత సాధించింది. సింగరేణిలోనే అత్యధికంగా మార్చి 28న కొత్తగూడెం ఏరియా 80,931టన్నుల బొగ్గును ట్రాన్స్​పోర్టు చేసి రికార్డు సృష్టించింది.