లిథియం మైనింగ్​పై సింగరేణి ఫోకస్

లిథియం మైనింగ్​పై సింగరేణి ఫోకస్
  • క్రిటికల్ మినరల్స్ తవ్వకాల వైపు అడుగులు
  • ఎలక్ట్రిక్ వాహనాల్లో రా మెటీరియల్​గా లిథియం
  • కాలానికి అనుగుణంగా మారాలని నిర్ణయం
  • బిడ్ దక్కించుకునేందుకు ప్రైవేటు సంస్థలతో పోటీ
  • ఇప్పటికే వేలం ప్రక్రియకు కేంద్రం సన్నాహాలు

హైదరాబాద్, వెలుగు : భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనున్న నేపథ్యంలో... వాటి బ్యాటరీల్లో రా మెటీరియల్​గా వాడే లిథియం మైనింగ్​పై సింగరేణి దృష్టి పెట్టింది. ప్రస్తుతం కోల్ మైనింగ్ చేస్తూ దేశంలోని పలు థర్మల్ పవర్ స్టేషన్​లకు బొగ్గు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నది. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ ద్వారా లిథియం వెలికి తీయాలని సింగరేణి భావిస్తున్నది. 

ఎలక్ట్రిక్ వెహికల్స్​లో వాడే లిథియం ఐయాన్ బ్యాటరీలను లోకల్​గా తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏడాది కిందే క్రిటికల్ మినరల్స్ వేలానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో 20 లిథియం బ్లాక్​లను గుర్తించింది. వీటిని వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. లిథియం బ్లాక్​ల వేలం ద్వారా రూ.45వేల కోట్ల ఆదాయం జనరేట్ చేయాలని కేంద్రం భావిస్తున్నది. కాగా, చత్తీస్​గఢ్​లోని కోబ్రా డిస్ట్రిక్ట్​లో ఉన్న లిథియం బ్లాక్​ను వేలం వేయాలని నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్, మణిపూర్ తదితర ప్రాంతాల్లో క్రిటికల్ మినరల్ మైనింగ్ అన్వేషణ కొనసాగిస్తున్నది. 

ఈ నేపథ్యంలోనే సింగరేణి యాజమాన్యం.. లిథియం మైనింగ్ బిడ్​లను దక్కించుకునేందుకు రంగంలోకి దిగాలని యోచిస్తున్నది. మరోవైపు అదానీ, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిమాద్రి కెమికల్స్, దాల్మియా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి ప్రైవేటు కంపెనీలతో పాటు ఎన్ఎల్​సీ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లిథియం బ్లాక్​లను వేలంలో దక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

సోలార్ పవర్ స్టోరేజీకి సింగరేణి ప్రణాళికలు

సింగరేణి ద్వారా జైపూర్​లోని 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రోజువారీగా కరెంట్ ఉత్పత్తి జరుగుతున్నది. అదేవిధంగా, మరో 584 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్లాంట్ పనులు సగం వరకు పూర్తికాగా, కరెంట్ ఉత్పత్తి కూడా మొదలైంది. మరోవైపు జియో.. థర్మల్ ప్లాంట్​ల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నది.

 సింగరేణి ప్లాంట్​లలో జనరేట్ అయిన పవర్.. డిస్కంలకు సరఫరా అవుతున్నది. అవసరం మేరకు సింగరేణి సంస్థ కూడా కరెంట్​ను వినియోగించుకుంటున్నది. దాదాపు 4 మిలియన్ యూనిట్ల పవర్ వృథా అవుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాటరీలను ఏర్పాటు చేసి కరెంట్ నిల్వ చేయనున్నది. సింగరేణి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. మరోవైపు లిథియం మైనింగ్​పై కూడా ఫోకస్ పెట్టింది. 

భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్

దేశవ్యాప్తంగా ఇంధన అవసరాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తున్నది. ఇండియాలో సేల్ అవుతున్న కార్లలో రెండు శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటున్నాయి. పోయిన ఏడాది 39లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయి. దీన్ని రాబోయే 2030 నాటికి 30శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలే కీలకమైన నేపథ్యంలో లిథియం బ్లాక్​లకు డిమాండ్ ఏర్పడనున్నది. 

జమ్మూ కాశ్మీర్​లో 5.9 మిలియన్ టన్నులు లిథియం నిక్షేపాలు

చిలీ దేశం 9.3 మిలియన్​ల టన్నుల లిథియం నిక్షేపాలతో ప్రపంచంలోనే టాప్​లో ఉన్నది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వద్ద 6.2 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నాయి. ఇక ఇండియా.. ఒక్క జమ్మూ కాశ్మీర్​లోనే గుర్తించిన 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలతో మూడో స్థానంలో ఉన్నది. ఇండియా తర్వాత అర్జెంటీనాలో 2.7 మిలియన్ టన్నులు, చైనాలో రెండు మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వినియోగించే చైనాలో ఇండియా కంటే చాలా తక్కువగా లిథియం నిక్షేపాలు ఉండడం గమనార్హం.