- వేలంలో పాల్గొని దక్కించుకునేందుకు రెడీ
- ఐదు జాతీయ కార్మిక సంఘాలతో మీటింగ్
- సంస్థకు మద్దతు తెలిపిన మెజార్టీ సంఘాల నేతలు
- గత ప్రభుత్వ తీరుతో చేజారిన రెండు బ్లాక్ లు
- ఈసారి ఎలాగైనా చేజిక్కించుకునేలా సంస్థ కసరత్తు
- పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: శ్రావణపల్లి కోల్ బ్లాక్‌ను దక్కించుకునేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసుకుంటోంది. వేలంలో పాల్గొనేందుకు షెడ్యూల్వేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఐదు జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ మీటింగ్నిర్వహించింది. వేలంలో పాల్గొనేందుకు మెజార్టీ సంఘాల నేతలు కూడా సింగరేణికి మద్దతు తెలిపారు. మరోవైపు సంస్థ భవిష్యత్ దృష్ట్యా వేలంలో పాల్గొనేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా గ్రీన్సిగ్నల్ఇచ్చింది. ఇప్పటికే కోయగూడెం ఓసీ–3, సత్తుపల్లి జేవీఆర్‌ఓసీ బొగ్గు బ్లాకులు గత ప్రభుత్వ తీరుతో చేజారిపోగా.. శ్రావణపల్లి బ్లాక్ అయినా దక్కించుకునేందుకు సింగరేణి సన్నాహాలు చేసుకుంటోంది.
మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు
కేంద్రం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు మద్దతు కోసం జాతీయ కార్మిక సంఘాల నేతలతో బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సంస్థ మీటింగ్నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వేలంలో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదని సింగరేణి స్పష్టం చేసింది. బొగ్గు బ్లాకును దక్కించుకుంటే రాయల్టీ నాలుగు శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే14శాతం కట్టాల్సి వస్తుందని కార్మిక సంఘాల నేతల దృష్టికి తెచ్చింది. గత బీఆర్ఎస్ తీరుతో కోయగూడెం, సత్తుపల్లి జేవీఆర్ఓసీలు చేజారిపోయినట్టు వివరించింది.
ఇప్పటికైనా సింగరేణి భవిష్యత్దృష్ట్యా సహకరించాలని కార్మిక సంఘాల నేతలను కోరింది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ సంఘాలు మద్దతు తెలపగా.. సీఐటీయూ వేలానికి వ్యతిరేకమంటూనే పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఒకసారి కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హెచ్ఎమ్మెస్తెలిపింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మెజార్టీ జాతీయ సంఘాలు సింగరేణికి మద్దతు తెలిపాయి. దీంతో శ్రావణపల్లి కోల్ బ్లాక్ వేలానికి షెడ్యూల్వేసేందుకు సింగరేణి సిద్ధమవుతోంది.
అడ్డుపడిన గత బీఆర్ఎస్ సర్కార్
తమ అనుకూల సంస్థలకు లాభం చేకూర్చేందుకే గత బీఆర్ఎస్సర్కార్బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా అడ్డుపడిందని పలు కార్మిక సంఘాలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. కోయగూడెం ఓసీ–3తో పాటు సత్తుపల్లి జేవీఆర్ఓసీలకు కేంద్రప్రభుత్వం వేలం వేసిన టైంలో తాము కూడా పాల్గొనేందుకు సింగరేణి సంస్థ రూ. 60లక్షలతో షెడ్యూల్స్ కొన్నది. అయితే.. పాల్గొనకుండా గత బీఆర్ఎస్ సర్కార్అడ్డుపడడంతో సింగరేణి షెడ్యూల్స్వేయలేదు. దీంతో కోయగూడెం, సత్తుపల్లి జేవీఆర్ ఓసీలు సింగరేణి నుంచి చేజారిపోయాయి. గత బీఆర్ఎస్సర్కార్తీరుతోనే కోయగూడెం, సత్తుపల్లి జేవీఆర్ఓసీలు సింగరేణికి దక్కకుండా పోయాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ప్రధాని, కేంద్రమంత్రికి విన్నవించినా..
సింగరేణి సంస్థ భవిష్యత్దృష్ట్యా తెలంగాణలోని బొగ్గు బ్లాకులను కేటాయించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించింది. అయినా కేంద్రం నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో కొత్త బొగ్గు బ్లాకుల అవసరం దృష్ట్యా వేలంపై నిర్ణయాన్ని కూడా సింగరేణికే రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది. రాష్ట్రంలోని కోల్‌బ్లాకులను సింగరేణికే ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో వీలైనంతగా మాట్లాడుతామని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది.