బొగ్గు బ్లాకులు రాకుంటే..కష్టాల్లోకి సింగరేణి!

బొగ్గు బ్లాకులు రాకుంటే..కష్టాల్లోకి సింగరేణి!

 హైదరాబాద్​లో బొగ్గు గనుల వేలం  ప్రక్రియను శుక్రవారం లాంఛనంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రారంభించారు. సింగరేణి సహా ఇంకా దరఖాస్తుల దాఖలు పూర్తిస్థాయిలో మొదలుకాలేదు.  కొత్త  బొగ్గు బ్లాకులు రాకుంటే సింగరేణిని దశాబ్దంలోపే కష్టాలు ముట్టడించే అవకాశం ఉంది. గత పది ఏండ్లలో సంస్థ ఒక్క కొత్త బొగ్గు బావిని తవ్వలేదు. 

పాత గనులు బొగ్గు అయిపోయి మూతపడుతున్నాయి. ఇలా అయితే సింగరేణి మనుగడకే ప్రమాదం. ఇప్పటికే కొత్త బ్లాకులు లేక గత పది ఏండ్లుగా అపార నష్టం జరిగింది. రాజకీయాలు పక్కన బెట్టి,  బొగ్గు బ్లాకుల సాధన కోసం కృషి చేయాలి.  బొగ్గు గనుల ప్రాంతం నుంచి ఎంపిక అయిన ఎంపీలు  కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని రావాలి.  వేలంలో పాల్గొనకుండా బ్లాకులు వచ్చే పరిస్థితి ఉన్నదా?  అనేది చర్చనీయాంశంగా మారింది. 

 దేశంలోని  కోల్ ఇండియా, సింగరేణి ఎదుర్కొంటున్న ఈ బ్లాకుల  కేటాయింపు సమస్యను పరిష్కారం చేయడానికి దేశంలోని  బొగ్గు గనుల పరిధిలోని 25 మందికి పైగా ఉన్న ఎంపీలు  ఆలోచించాలి.  ప్రస్తుత పరిస్థితుల్లో వేలంపాట ద్వారా అయినా సరే కొత్త బ్లాకులు అత్యవసరం, అనివార్యం.  లేని పక్షంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం అసాధ్యం అవుతుంది. 

బ్లాకులు లేకపోతే  సింగరేణి  గోస పడుతుంది. సింగరేణి  మనుగడ దృష్ట్యా కొన్ని కొత్త బ్లాకులను సింగరేణి అత్యవసరంగా చేపట్టవలసి ఉంది.  అవసరమైతే బొగ్గు శాఖ నిర్వహించే వేలంపాటలో పాల్గొని కొత్త బ్లాకులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అలా కానట్లయితే  సింగరేణి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గతంలో సింగరేణి ప్రాంతంలోని కొన్ని కొత్త బ్లాకులను కేంద్ర బొగ్గు శాఖ వేలం పాటలో ఉంచగా.. 

వేలంపాటలో పాల్గొనకూడదని  సింగరేణి నిర్ణయించింది. ఆ కారణంగా అత్యంత లాభదాయకమైన కోయగూడెం ఓపెన్ కాస్ట్ 3, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థ కోల్పోయింది.  ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం  సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వేలంపాటలో పాల్గొనడం ద్వారా కూడా కొత్త బొగ్గు బ్లాకులు సాధించుకోవాలని ఆలోచన చేస్తున్నది. 

సింగరేణి భవిష్యత్తుకు ప్రాధాన్యమివ్వాలి

సింగరేణి యాజమాన్యం  వేలంపాట మార్గం ద్వారా సింగరేణి ప్రాంతంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో లాభదాయకంగా ఉన్న ఇతర బ్లాకులను కూడా చేపడితే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తును పరిగణనలోకి తీసుకోవాలి.  పలుమార్లు కేంద్రంతోనూ మాట్లాడిన తర్వాతే సింగరేణి సుస్థిర భవిష్యత్తును కాపాడాలన్న ఉద్దేశంతో  వేలం దిశగా ఆలోచన చేయడం జరిగిందని యాజమాన్యం తెలిపింది.

  వాస్తవ పరిస్థితులు ఈ విధంగా ఉండగా కొన్ని యూనియన్లవారు బొగ్గు వేలం పాటను అడ్డుకుంటామని,  సింగరేణి దీనిలో పాల్గొనకూడదని హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో కూడా  ఇదే సమస్యపై సమ్మె కూడా చేసిన కార్మిక సంఘాలు తద్వారా సింగరేణి  మనుగడ కోసం చేకూర్చిన ప్రయోజనం ఏమీ లేదు. 

కొత్త బ్లాకులతోనే సింగరేణి మనుగడ

సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు వస్తాయన్న ఉద్దేశంతో  వేల కోట్ల రూపాయలతో  సత్తుపల్లి, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో సీహెచ్పీలు,  రైల్వే లైన్లు, ఇతర అనేక మౌలిక సదుపాయాలు కల్పించుకోవడం జరిగింది. 

ఇప్పుడు  మనం  కనీసం వేలంలో  పాల్గొనడం ద్వారానైనా మిగిలిన బ్లాకులను దక్కించుకోగలిగితే  మన మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోగలుగుతాం అంటున్నారు అధికారులు. ఇప్పుడు కొత్త బ్లాకులు చేపట్టకపోతే 2027 తర్వాత సింగరేణిలో  ప్రస్తుత ఉన్న 40 బొగ్గు గనుల్లో  బొగ్గు నిల్వలు తరగిపోయి కేవలం 30 మాత్రమే మిగిలి ఉంటాయి. 2040 నాటికి కేవలం 12 గనులు మాత్రమే మిగులుతాయని చెబుతున్నారు.  కొత్త బ్లాకుల రాకతోనే  సింగరేణి సంస్థ మనుగడ ముడిపడి ఉంటుంది. 

కిషన్​రెడ్డి చేతిలో సింగరేణి భవిష్యత్తు

కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్​రెడ్డి  చేతిలో సింగరేణి భవిష్యత్తు ఉన్నది!   మందమర్రి సమీప శ్రావణపల్లి బొగ్గు బ్లాక్​ను  మరోసారి కేంద్రం వేలం జాబితాలో పెట్టింది. నాలుగేండ్ల  క్రితం సింగరేణికి ఈ బ్లాక్ వల్ల ఆర్థిక ప్రయోజనం ఉండదని, 70 శాతం అడవి, 30 శాతం మామిడి తోటలు ప్రైవేట్ భూములు ఉన్నాయని సింగరేణి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ వేలం జాబితాలో శ్రావణపల్లి వచ్చింది. 

చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడ తమ భూములు ఇచ్చేది లేదని, అక్కడ బొగ్గు తవ్వకానికి అంగీకరించేది లేదని ప్రజలు తెగేసి చెబుతున్నారు. టీజేఎస్​అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి శ్రావణపల్లి బ్లాక్​ను  వేలం జాబితా నుంచి మినహాయించాలని కోరారు.  బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే, గడ్డం వివేక్, ఎంపీ గడ్డం వంశీలను కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని  కోరుతున్నారు.

కేసీఆర్​ సర్కారు వల్లే సంక్షోభం

2015లో  గనుల వేలం చట్టం తీసుకొచ్చినప్పుడు సమర్థించిన అప్పటి  రాష్ట్ర పాలకులు దాని  పర్యవసనాలను ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.  కానీ,  గత 10 ఏండ్లలో  సింగరేణిపై  అప్పటి  రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల కలిగిన నష్టాలను, దీర్ఘకాలంలో ఎదుర్కోబోయే సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం గనుల వేలంలో సాకారాత్మక ఆలోచన విధానంతో పాల్గొనడం మంచి పరిణామం. 

ఇప్పట్లో గనుల చట్టంలో  మార్పులు వచ్చే అవకాశం లేదని, అది మారనంతవరకు  బొగ్గు బ్లాకుల కేటాయింపు వేలంలో తప్పితే  దక్కించుకోవడం కష్టం. అయితే చట్టంలోని సెక్షన్ 17 ( ఎ)ను కేంద్రం విస్మరించి,  ప్రభుత్వ రంగంలోని సింగరేణి,  కోల్ ఇండియాను కూడా వేలంలో పాల్గొనమనడం న్యాయం కాదనే వాదన ఉన్నది. 

గని వద్దంటే, వద్దు అంటున్న ప్రజలు 

గని విషయంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలోచించాలి. న్యాయమైన రైతుల డిమాండ్​ను అంగీకరించాలి. శుక్రవారం దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాకులను  వేలం పాటకు రెడీ చేసిన పోర్టల్​ను  హైద రాబాద్​లో  కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.  టెండర్లు వేయడం, కేటాయింపు తదితర ప్రాసెస్​కు మూడు నెలల కాలం పడుతుంది. 

2015లోనే  బీజేపీ ప్రభుత్వం చేసిన బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించే చట్టంలో సెక్షన్ 17 ( ఎ ) ప్రకారం సింగరేణి ప్రాస్పెక్టింగ్ చేసిన బొగ్గు బ్లాకులను సింగరేణికి వేలంలో పాల్గొనకుండా ఇవ్వవచ్చు. అలా ఇవ్వడానికి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కృషి చేయాలి.  ఇలా మొత్తం 1400 మిలియన్ టన్నుల నిక్షేపాలను సింగరేణి వెలికి తీయవచ్చు. 2032లో 11 గనులు,  2038 నాటికి 5 గనులు..  ఇలా 16 గనులు మూతపడే పరిస్థితి ఉంది. 

 దీనితో కొత్త బ్లాకులు రాకుంటే సింగరేణి మనుగడ అసాధ్యం అవుతుంది.  సింగరేణి మిగలదు. శుక్రవారం కార్మిక సంఘాలన్నీ  గనుల్లో  మా బొగ్గు బ్లాకులు  మాకు కేటాయించాలని ఆందోళనకు దిగాయి.  కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేశాయి. ఈనేపథ్యంలో కార్మికుల ఆందోళనను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. 

 ఎండి. మునీర్,
 సీనియర్ జర్నలిస్ట్