బొగ్గు అమ్మకంతో సింగరేణికి లాభాలు ఒక్క శాతమే

బొగ్గు అమ్మకంతో సింగరేణికి లాభాలు ఒక్క శాతమే
  • విద్యుత్ అమ్మకం, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ వల్లే  సింగరేణికి లాభాలు: సీఎండీ ఎన్.బలరాం
  • ఉత్పత్తి, ఉత్పాదకత పెంచకపోతే మనుగడకు ప్రమాదం
  • అధికారులు, ఉద్యోగులు పనితీరు మార్చుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: సింగరేణికి కేవలం బొగ్గు ఉత్పత్తితోనే లాభాలు రావట్లేదని.. కరెంట్ అమ్మకాలు, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ వల్లే సంస్థ లాభాల్లో ఉందని సీఎండీ ఎన్.బలరాం అన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో ‘‘ఉజ్వల సింగరేణి–ఉద్యోగుల పాత్ర’’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు పనితీరును మెరుగుపరుచుకోకుంటే సంస్థ మనుగడకే ప్రమాదమని అన్నారు. ‘‘సింగరేణికి బొగ్గు అమ్మకాలతో వస్తున్న లాభాలు 1 శాతం కన్నా తక్కువే.

ఇతరత్రా ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ వల్లే లాభాలు పెరిగాయి. సంస్థ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కోసం నాలుగేండ్లలో అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నం. దాంతో ఏఏ గ్రేడ్- గా ఉన్న సంస్థ ఆర్థిక పరపతి ఏఏ+ స్థాయికి చేరింది. అలాగే సింగరేణికి బాకీ పడిన విద్యుత్ సంస్థలకు తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పించి దాదాపు రూ.20 వేల కోట్ల బాకాయిలు వసూలు చేశాం” అని అన్నారు. సంస్థకు డిపాజిట్లపై వడ్డీ ద్వారా రూ.900 కోట్లు, థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా రూ.500 కోట్ల లాభం వస్తున్నదని పేర్కొన్నారు.

అండర్ గ్రౌండ్ తో టన్నుకు రూ.6 వేలు లాస్

అండర్ గ్రౌండ్ మైన్​లో టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.10వేలు ఖర్చు అవుతుండగా, ఆ బొగ్గు అమ్మకంతో రూ.5వేల లోపు మాత్రమే వస్తుందని బలరాం అన్నారు. దీంతో రూ.6వేల వరకు నష్టం వస్తున్నదని తెలిపారు. ఓపెన్ కాస్ట్ లో భారీ యంత్రాలు రోజులో సగం గంటలే పని చేస్తున్నాయని తెలిపారు.

పోటీ మార్కెట్ లో నిలబడాలంటే కార్మికులు యంత్రాలను పూర్తిగా వినియోగించాలని అన్నారు. లేదంటే సంస్థ మనుగడకు ప్రమాదమని హెచ్చరించారు. వివిధ విభాగాలు అధికారులు విధులు పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు గమనించానని అలాంటి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.