
- రూ.15 లక్షలకు పెరిగిన మెడికల్ స్కీమ్
- వచ్చే మార్చి 31లోపు దరఖాస్తులకు వీలు
- సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి ప్రచారం
కోల్బెల్ట్, వెలుగు : కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెంట్ మెడికేర్స్కీమ్(సీపీఆర్ఎంఎస్)లో కొత్తగా చేరేందుకు సింగరేణి మరో చాన్స్ ఇచ్చింది. ఇంకా చాలామంది చేరకపోవడంతో గడువు పొడిగించింది. వచ్చే మార్చి 31లోపు అప్లై చేసుకోవాలని సూచించింది. పదో వేతన సవరణ కాలం మేరకు 2018 ఏప్రిల్నుంచి కోల్ ఇండియా సంస్థ స్కీమ్ కు అప్లికేషన్లు తీసుకోగా.. సింగరేణిలో లేటుగా అమలులోకి వచ్చింది. కాగా.. గతేడాది నాటికి సుమారు 36 వేల మంది మెంబర్లుగా చేరారు.
మొదట్లో కార్మికుల నుంచి రూ.10వేలు ప్రీమియం నగదుగా వసూలు చేసింది. పదో వేతన సవరణ సమయంలో ప్రతి రిటైర్డు ఉద్యోగి రూ.40వేలు చెల్లిస్తేనే సభ్యులుగా చేర్చుకుంది. ఇప్పుడు పదకొండో వేతన సవరణ సమయం నాటికి రూ.60వేలు చెల్లించాల్సి ఉంది. మెంబర్ షిప్ గడువు, వైద్య సేవల పరిమితిని పెంచినందున కొద్దిరోజులుగా సీపీఆర్ఎంఎస్ స్కీమ్ లో రిటైర్డ్ ఉద్యోగులు చేరాలంటూ సింగరేణి ప్రచారం చేస్తోంది.
రూ.15లక్షల వరకు పరిమితి పెంపు
రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సేవల స్కీమ్ పరిమితిని రూ.15లక్షలకు పెంచింది. ఇది ఉద్యోగి దంపతుల్లో ఒక్కొక్కరికి రూ.7.5 లక్షల చొప్పున వర్తించనుంది. అంతకుముందు రూ.8 లక్షల వరకే పరిమితి ఉండగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్య కార్డు పొందిన వారు ఏదైనా అనారోగ్యం బారిన పడితే ఫ్రీగా ట్రీట్మెంట్పొందొచ్చు.
ఒక వేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వైద్యసాయం పొందాల్సి వస్తే.. చికిత్స తర్వాత బిల్లులు మంజూరు చేస్తారు. అయితే.. సభ్యులుగా చేరిన రిటైర్డు కార్మికులకు మాత్రమే స్కీమ్ వర్తిస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రులతో సింగరేణి అగ్రిమెంట్ చేసుకుంది. సాధారణ జబ్బులకు రూ.15లక్షల వరకు పరిమితి కాగా .. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, గుండె, ఎయిడ్స్వంటి రోగాలను గరిష్ఠ పరిమితి లేకుండా సంస్థ వైద్య ఖర్చులను భరిస్తోంది.
ఇది ఆరో వేతన సవరణ కాల పరిమితి నుంచి అమలవుతోంది. అప్పటి నుంచి సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందినవారు లక్షమంది వరకు ఉంటారు. అందులో 36వేల మంది మాత్రమే మెంబర్లుగా చేరారు. ఇంకా చేరనివారుంటే, రిటైర్డు కార్మికులు మిగిలిన రూ.60వేలు చెల్లించి స్కీమ్ లో సభ్యత్వం పొందవచ్చని సింగరేణి సూచించింది. అయితే.. ఉద్యోగ విరమణ పొందిన చాలా మంది వివిధ ప్రాంతాల్లో స్థిరపడగా.. సమాచారం చేరేవేసేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టారు.