భారీ వర్షాలు... సింగరేణికి రూ.కోట్లలో లాస్​

భారీ వర్షాలు...  సింగరేణికి రూ.కోట్లలో లాస్​

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు:   నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో మంచిర్యాల,  అసిఫాబాద్ జిల్లాల్లోని సింగరేణి ఓపెన్​కాస్ట్​ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. శుక్రవారం పెద్ద వాన రావడంతో   గనుల్లోని క్వారీ రోడ్లు బురదమయమై హేవీ వెహికల్స్​ ఎక్కడికక్కడ  నిలిచిపోయాయి. దీంతో మందమర్రి ఏరియాలో కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ, శ్రీరాంపూర్​ ఏరియాలోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీ, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరీగురా ఓసీపీల్లో సుమారు 1.30లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.  

ఎడతెరిపి లేని వానలతో బెల్లంపల్లి రీజియన్​ పరిధిలో  సింగరేణి సంస్థ  దాదాపు రూ.50కోట్లకు పైగా విలువైన బొగ్గును ఉత్పత్తికి చేయలేకపోయింది.  ఈనెల 17న మూడో షిఫ్టు నుంచి కురుస్తున్న వానలతో  ఓసీపీల్లో  బొగ్గు ఉత్పత్తి, ఓవర్​బర్డెన్​ వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఓసీపీ క్వారీ ప్రాంతాల్లోకి భారీగా నిలిచిన  నీటిని ఎప్పటికప్పుడు  భారీ మోటార్​పంపుల ద్వారా పైకి పంపిస్తున్నారు.  ఓసీపీ యార్డుల్లో స్టాక్​ కోల్​ నిల్వలు కూడా నిండిపోయాయి. 

-ఓసీపీలను పరిశీలించిన సింగరేణి డైరెక్టర్

భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్​కాస్ట్​ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో శుక్రవారం మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్​కాస్ట్ గనిని సింగరేణి డైరెక్టర్​(ప్రాజెక్ట్​, ప్లానింగ్​) జి.వెంకటేశ్వర్​రెడ్డి, ఆర్కేపీ ఓసీపీని మందమర్రి ఏరియా జీఎం జి.మోహన్​రెడ్డి వేర్వేరుగా పరిశీలించారు. సాయంత్రం సింగరేణి డైరెక్టర్​  మందమర్రి ఏరియా జీఎం ఆఫీస్​లో ఏరియా జీఎం జి.మోహన్​రెడ్డి,  ఏస్వోటు జీఎం రాజేశ్వర్​రెడ్డి, ఏజెంట్​ రాందాస్​, శాంతిఖని, ఆర్కేపీ, కేకే ఓసీపీ పీవోలు విజయప్రసాద్​,  గోవిందరావు, రమేశ్​, డీజీఎం ఐఈడీ రాజన్న, ఏజీఎం నాగరాజు, ఆర్కేపీ ఓసీపీ మేనేజర్​ వెంకటేశ్వర్లు  తదితర ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన నేపథ్యంలో అండర్​గ్రౌండ్​ గనుల్లో బొగ్గు ఉత్పత్తి  పెంచాలని సూచించారు. 

సత్తుపల్లి ఓసీల్లో  రూ.20కోట్లు..

సత్తుపల్లి, వెలుగు:  ఎడతెరిపి వానలతో సత్తుపల్లి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్ మైన్ ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. జేవీఆర్ ఓసీలో18వేల క్యూబిక్ మీటర్ల మేర ఓబీ వెలికితీత(మట్టి తొలగించడం), 30 వేల టన్నులు బొగ్గు తవ్వకాలు, కిష్టారం ఓసీలో 45వేల క్యూబిక్ మీటర్ల మేర ఓబీ పనులు, 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్​ పడింది. దీంతో 1,14,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో దాదాపు రూ.20 కోట్ల నష్టం వాటిల్లింది.