థర్మల్​ పవర్​ ప్లాంట్​ నుంచి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సింగరేణి ప్రయత్నాలు

 థర్మల్​ పవర్​ ప్లాంట్​ నుంచి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సింగరేణి ప్రయత్నాలు

కోల్​బెల్ట్​/జైపూర్​,వెలుగు: థర్మల్​ పవర్​ ప్లాంట్​ నుంచి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సింగరేణి ప్రయత్నాలు చేపట్టింది. ఇందుకోసం రూ.696 కోట్ల వ్యయంతో ఫ్లూ గ్యాస్​ డీసల్పరైజేషన్(ఎఫ్​జీడీ)​ యూనిట్ల నిర్మాణాలు చేపట్టింది. థర్మల్​ పవర్​ ప్లాంట్ల ద్వారా వచ్చే పొగలో సల్ఫర్​, కార్భన్​, లెడ్​తో పాటు మరిన్ని విషవాయువులుంటాయి. థర్మల్​ విద్యుత్​ ఉత్పత్తి టైంలో విడుదల అవుతున్న సల్ఫర్​ ఆక్సైడ్​ శాతం ఘనపు మీటర్​కు 2వేల మిల్లీ గ్రాములుంటుంది. దీని వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి, సమీప గ్రామాల ప్రజలు అనారోగ్య బారిన పడతారు. దీన్ని నివారించేందుకు ఫ్లూ గ్యాస్​ డీసల్ఫరైజేషన్​ యూనిట్లను ఏర్పాటు చేయాలని 2015లో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎఫ్​జీడీ యూనిట్ల వల్ల పవర్​ ప్లాంట్​ పరిసరాలు కాలుష్యం కాకుండా ఉంటాయి. 

కొనసాగుతున్నపనులు.. 

హైదరాబాద్​కు చెందిన పీఈఎస్ ఇంజినీర్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ టెండర్​ ద్వారా నిర్మాణ పనులు చేపట్టింది. ఎస్టీపీపీలో 600 మెగావాట్ల కెపాసిటీ కలిగిన రెండు యూనిట్లు ఉండటంతో వాటికోసం ప్రత్యేకంగా 150 మీటర్ల ఎత్తుతో రెండు చిమ్నీలను  ఏర్పాటు చేస్తున్నారు. గతయేడాది అక్టోబర్​ మొదటి వారంలో వీటి పనులు మొదలయ్యాయి. మొదటిది ఇప్పటికే 115 మీటర్లకు పైగా, రెండోది 60మీటర్లపై ఎత్తు వరకు పూర్తయ్యాయి. మరోవైపు ఇంటర్​ కనెక్టింగ్​ ఫౌండేషన్​, అబ్జర్వర్​, ట్యాంకుల ఫౌండేషన్​ పనులు, బూస్టర్​ ఫ్యాన్​, ప్యూయల్​, ఫ్యాబ్రికేషన్​ పనులు వివిధ దశల్లో సాగుతున్నాయి. 

ఇదీ పని ..

పవర్​ ప్లాంట్​లో ఫ్లూ గ్యాస్​ డీసల్ఫరైజేషన్​ చేసే ప్రక్రియలో బొగ్గును మండించగా వచ్చే.. వాయువు నుంచి సల్ఫర్​ వాయువులను వేరు చేస్తారు. రసాయనిక చర్య వల్ల సల్ఫర్​ గ్యాస్​లను తడిసున్నం పీల్చుకుంటుంది. చివరకు బయటకు విడుదలయ్యే వాయువుల్లో సల్ఫర్​ గ్యాస్​ శాతం తగ్గుతుంది. మరోవైపు రసాయనిక చర్య వల్ల జిప్సం(కాల్షియం సల్పేట్​) ఏర్పడుతుంది. ఈ జిప్సంను ఎరువులు,  సిమెంటు, పేపర్,  వస్త్ర పరిశ్రమ, నిర్మాణరంగంలో వినియోగించుకునే వీలుంది. ఇప్పటికే ప్లాంట్​లో బొగ్గును మండించగా వెలువడుతున్న బూడిదను వందశాతం గాలిలో కలువకుండా కొన్నేళ్లుగా చర్యలు తీసుకుంటున్నారు. బూడిదను సిమెంట్​ ఇటుకలు, రోడ్డు నిర్మాణానికి వాడుతున్నారు. సింగరేణి ఎస్టీపీపీకి రెండు సార్లు జాతీయ స్థాయిలో బెస్ట్​ ఫ్లైయాష్​ యుటిలైజేషన్​ అవార్డులు రాగా.. మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు సొంతం చేసుకుంది. పూర్తిస్థాయి కాలుష్యనియంత్రణకు చేపట్టిన ఎఫ్​జీడీ యూనిట్ల నిర్మాణంలో మొదటి చిమ్నీని జూన్​ కల్లా రెండోది వచ్చే ఏడాది సెప్టెంబర్​లో పూర్తి చేస్తామని సింగరేణి సీఎండీ ఎన్​ శ్రీధర్​ తెలిపారు.