తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్కంపెనీ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో చరిత్రను తిరగరాసింది. 135 ఏండ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా దాదాపు 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి గత రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో పాటు దాదాపు 69.80 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 37వేల కోట్ల టర్నోవర్ సాధించింది. దీంతో ఈసారి దాదాపు రూ. 2,500 నుంచి రూ. 3వేల కోట్ల మేర లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఈ ఏరియాలు సింగరేణికి మణిహారాలు
ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్జిల్లాల్లోని12 ఏరియాల్లో సింగరేణి విస్తరించింది. ఇందులో ఇల్లెందుతో పాటు, కొత్తగూడెం, మణుగూరు, బెల్లంపల్లి, ఆర్జీ–1, ఆర్జీ–2, ఆర్జీ–3 ఏరియాలు మాత్రమే నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలిగాయి. అత్యధికంగా కొత్తగూడెం ఏరియా 138 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి రికార్డు సృష్టించింది. భూపాలపల్లి ఏరియా అన్ని ప్రాంతల కంటే వెనుకబడి ఉంది. బొగ్గు ప్రొడక్షన్లో ఓసీపీలు కీలక భూమిక పోషించాయి.