- సింగరేణిలో అంబులెన్స్‌ల దుర్వినియోగం
- ముగ్గురు పైలట్లు ఉండాల్సి ఉన్నా.. ఇద్దరితోనే కొనసాగింపు
- వరుస డ్యూటీలతో ప్రమాదాల బారిన అంబులెన్స్ లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి హాస్పిటల్స్ అంబులెన్స్‌లను ఆఫీసర్లు సొంత అవసరాలకు వినియోగిస్తున్నారు. పేషెంట్ల పరిస్థితులను పట్టించుకోవడం లేదు. కొత్తగూడెంలో ఉన్న మెయిన్ హాస్పిటల్ తోపాటు ఇల్లెందు ఏరియాలోని అంబులెన్స్‌లను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. ఇల్లెందు ఏరియాకు చెందిన సింగరేణి అంబులెన్స్‌ను ఓ డాక్టర్ తన సొంత అవసరాలకు వాడుకుంటుండగా విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఇదే పరిస్థితి సింగరేణి వ్యాప్తంగా పలు హాస్పిటల్స్ల్లో ఉన్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
టెండర్ ద్వారా మెయింటెనెన్స్...
జిల్లా కేంద్రంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్‌తోపాటు ఇల్లెందు, మణుగూరు ఏరియా హాస్పిటల్స్ ల్లో నాలుగు చొప్పున అంబులెన్స్‌లున్నాయి. కొత్తగూడెంలో మరో రెండు సంజీవని పేరుతో నడుస్తున్నాయి. రుద్రంపూర్డిస్పెన్సరీలో మరో అంబులెన్స్‌కూడా ఉంది. టెండర్పద్ధతిలో అద్దె ప్రాతిపదికన అంబులెన్స్‌లను సింగరేణి యాజమాన్యం వినియోగిస్తోంది. అత్యవసర సమయాల్లో పేషెంట్లను ఇంటి నుంచి హాస్పిటల్‌కు, ఏరియా హాస్పిటల్స్నుంచి కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్‌కు, రిఫరల్పేషెంట్స్ ను హైదరాబాద్‌లోని వివిధ హాస్పిటల్స్‌కు తరలించేందుకు అంబులెన్స్‌లను వాడుతారు. మైన్స్యాక్సిడెంట్స్ టైంలోనూ ఇవే అంబులెన్స్‌లను వినియోగిస్తుంటారు.
ఇష్టారాజ్యంగా ఇల్లెందు డాక్టర్ తీరు..
ఇల్లెందు ఏరియా హాస్పిటల్లో పని చేస్తున్న ఓ డాక్టర్సొంత అవసరాలకు ఇష్టారాజ్యంగా అంబులెన్స్‌లను వాడుతున్నారు. డాక్టర్ బంధువులు కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లో ఉంటారు. ఇల్లెందు నుంచి కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్‌కు పేషెంట్లను తీసుకెళ్లినప్పుడల్లా ఈ అంబులెన్స్ దాదాపు పది కిలోమీటర్ల దూరంలోని రుద్రంపూర్‌కు డాక్టర్ బంధువుల ఇంటికి వెళ్తుంది. బంధువులను ఇల్లెందుకు తీసుకెళ్లి ఇంటి వద్ద వదులుతుంటారు. ఈ క్రమంలోనే గతమంగళవారం ఇల్లెందు నుంచి పేషెంట్‌ను కొత్తగూడెంలోని మెయిన్ హాస్పిటల్‌కు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అక్కడ దింపాక అంబులెన్స్ రుద్రంపూర్‌లోని డాక్టర్ బంధువుల ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న సింగరేణి విజిలెన్స్ సిబ్బంది నిఘా వేసి పట్టుకున్నారు. విచారించగా పలుమార్లు అంబులెన్స్ డాక్టర్ బంధువుల ఇంటికి వస్తున్నట్టు వెల్లడైంది. అంబులెన్స్‌లో పేషెంట్ తోపాటు బంధువుల రాకపోకలు కామన్‌గా మారింది.
ట్రాన్స్ పోర్టు వెహికల్స్‌గా అంబులెన్స్ లు..
కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లోని అంబులెన్స్‌లను ట్రాన్స్ పోర్టు వెహికల్స్‌గా వాడుతున్నారు. పట్టణంలోని హోల్ సెల్ మెడికల్ షాపుల నుంచి మెడిసిన్స్‌ను తెచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు కార్గో, ఇతర షాపుల నుంచి మెడిసిన్స్‌ను తెచ్చేందుకు నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్‌లను వాడుతున్నారు. అందుకు వేరే వాహనాలను వాడాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టి అంబులెన్స్‌లనే వాడుతుండడంలో ఆంతర్యమేమిటో సింగరేణి ఆఫీసర్లకే తెలియాలి. ఇటీవలే టెండర్ గడువు ముగిసిన రెండు అంబులెన్స్‌లను ఆఫీసర్లు పక్కన పెట్టారు. ఎక్స్టెన్షన్ అడిగితే కుదరదు అని చెప్పిన ఆఫీసర్ల మాటలు రెండు రోజుల్లోనే మారాయి. వాటికి ఎక్స్ టెన్షన్ ఇవ్వడం చర్చానీయాంశంగా మారింది.
ముగ్గురి జీతాలిస్తున్నా.. డ్యూటీలో ఇద్దరే..
ప్రతి అంబులెన్స్‌కు ముగ్గురు డ్రైవర్లు ఉండాలి. కాని ఇద్దరితోనే యజమానులు సాగిస్తున్నారు. ఒక్కో అంబులెన్స్‌కు ముగ్గురు డ్రైవర్ల జీతాలను సింగరేణి చెల్లిస్తున్నా ఇద్దరినే వినియోగిస్తూ మరో డ్రైవర్ జీతాన్ని జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా సింగరేణి అధికారులు, విజిలెన్స్ వారు పట్టించుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడ్తొందనే విమర్శలున్నాయి. పలు అంబులెన్స్‌లకు ఫిట్ నెస్ లేకున్నా నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో కొత్తగూడెం మెయిన్హాస్పిటల్ నుంచి హైదరాబాద్‌కు పేషెంట్ ను తీసుకెళ్తున్న అంబులెన్స్టైర్ వీల్ ఆక్సిల్ విరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కొంత కాలం తర్వాత ఇదే అంబులెన్స్మరో పేషెంట్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా నార్కాట్ పల్లి వద్ద డివైడర్‌ను ఢీకొంది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వరుస డ్యూటీలు చేస్తున్న డ్రైవర్లు నిద్ర మత్తులో ప్రమాదాలు అవుతున్నాయనే మాట వినిపిస్తోంది.
విచారించి చర్యలు తీసుకుంటాం..
నిబంధనల ప్రకారం ఒక్కో అంబులెన్స్‌కు ముగ్గురు డ్రైవర్లుండాలి. ఇద్దరే అన్న విషయం మా దృష్టికి రాలేదు. ఇల్లెందు ఏరియా హాస్పటల్ అంబులెన్స్సొంత అవసరాలకు రుద్రంపూర్ వెళ్లిన విషయం తెలియదు. ఎంక్వైరీ చేయిస్తాం. కార్గో, బయటి షాపుల నుంచి మెడిసిన్స్, ఇతరత్రా అవసరాలపై కూడా విచారిస్తాం.
వెంకటేశ్వరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సింగరేణి