- అప్పుల ఊబిలో సింగరేణి
- బకాయిలు ఇప్పించని సర్కారు.. జీతాల కోసమూ తండ్లాడుతున్న సంస్థ
- రాష్ట్రం వచ్చినప్పుడు 3,540 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్..
- ఇప్పుడు రూ.4,900 కోట్ల అప్పులు
- జెన్కో, ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన బాకీలు రూ. 15 వేల కోట్లు
- అప్పులు చేస్తే కానీ ముందుకు నడవని పరిస్థితి
- కాంట్రాక్టర్లకు నిలిచిపోయిన రూ.500 కోట్లకు పైగా చెల్లింపులు
- నైని , మహా పాదపాత్ర కోల్బ్లాకుల్లో ప్రారంభం కాని ఉత్పత్తి
- ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక కొత్త ప్రాజెక్టుల జోలికెళ్లని సంస్థ
- సొంత రాష్ట్రంలో నాలుగు బొగ్గు బ్లాకుల వేలంలోనూ పాల్గొంటలే
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సిరులతల్లి సింగరేణి రాష్ట్ర సర్కారు తీరు వల్ల అప్పులపాలైతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రూ. 3,540 కోట్ల విలువైన బాండ్స్, బ్యాంక్బ్యాలెన్స్తో ఉన్న సంస్థ.. ప్రస్తుతం రూ. 4,900 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్కో, ట్రాన్స్‌కో నుంచి రూ. 15 వేల కోట్లకు పైగా బకాయిలు రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఏండ్లు గడుస్తున్నా ఈ బకాయిలు ఇప్పించలేకపోతున్న రాష్ట్ర సర్కారు.. డీఎంఎఫ్ టీ సహా పలు స్కీముల పేరిట సింగరేణి నిధులను దారి మళ్లిస్తున్నది. దీంతో నెలనెలా కార్మికులు, ఉద్యోగుల వేతనాల కోసం యాజమాన్యం దిక్కులు చూస్తున్నది. మొదట్లో బాండ్లను కుదవబెట్టి అప్పులు తెచ్చినప్పటికీ, ఆ నిల్వలు కూడా కరిగిపోవడంతో అప్పులు చేస్తున్నది. తాజాగా కాంట్రాక్టర్లకు కూడా సుమారు రూ. 500 కోట్లకు పైగా బకాయిపడడం సింగరేణి తాజా ఆర్థిక పరిస్థితికి అద్దం పడ్తున్నది. ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ప్లాంట్చేపట్టిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లో సింగరేణితో పెట్టుబడులు పెట్టించాలన్న రాష్ట్ర సర్కారు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
బొగ్గు, కరెంట్అమ్మకాలకు సంబంధించి సింగరేణికి రావాల్సిన బకాయిలు సుమారు రూ. 20 వేల కోట్ల దాకా ఉంటే.. అందులో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలే ఏకంగా రూ. 15 వేల కోట్ల దాకా ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. వీటిని ఇప్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర సర్కారు.. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) కింద అభివృద్ధి పనులపేరిట నియోజకవర్గాల్లో ఏటా రూ. 500 కోట్లకుపైగా ఖర్చు పెట్టిస్తున్నది. ఇప్పటివరకు ఈ డీఎంఎఫ్టీ రూపంలో రాష్ట్ర సర్కారు రూ. 3 వేల కోట్ల దాకా సింగరేణి ఖజానాకు కన్నం పెట్టింది. ఇక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద ఏటా రూ.230 కోట్లను సింగరేణితో రాష్ట్ర సర్కారు బలవంతంగా ఖర్చు పెట్టిస్తున్నది. సింగరేణి ప్రభావిత జిల్లాల్లో మాత్రమే ఖర్చు పెట్టాల్సిన ఈ ఫండ్స్‌ను సింగరేణితో సంబంధం లేని సిరిసిల్ల, సిద్దిపేట లాంటి జిల్లాల్లో కూడా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇవి చాలవన్నట్లు కోల్‌బెల్ట్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల పేరుతో 12 మంది ఎమ్మెల్యేలకు ఏటా రూ. 2 కోట్ల చొప్పున రూ. 24 కోట్లు ఇప్పిస్తున్నది. కరోనా సాయం అంటూ సింగరేణి నుంచి రూ. 40 కోట్లు తీసుకున్న ప్రభుత్వం, ఇటీవల రామగుండంలో ప్రభుత్వం కట్టబోయే మెడికల్ కాలేజీకి కూడా రూ. 500 కోట్లు సింగరేణి నుంచి ఇచ్చేలా ఒప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏది చెబితే దానికి సింగిరేణి సీఎండీ శ్రీధర్ ఊకొట్టడం వల్లే సంస్థకు ఈ పరిస్థితి దాపురించిందని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశించినట్లు లేకపోవడం వల్లే గడిచిన కొన్నేండ్లుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం లేదని, సొంత రాష్ట్రంలో నాలుగు బొగ్గు బ్లాకులు వేలం వేస్తే బిడ్ వేసేందుకు కూడా సాహసించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఒడిశాలోని నైని , మహా పాదపాత్ర లాంటి కోల్బ్లాక్లలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి ప్రారంభించకపోవడానికి కూడా ఇదే కారణమనే అభిప్రాయాలున్నాయి.
టర్నోవర్ పెరిగినా లాభాలు పెరగట్లే..
తెలంగాణ ఏర్పడిన 2014లో సింగరేణి టర్నోవర్ రూ. 12 వేల కోట్లు కాగా.. 2022- – 23లో రికార్డు స్థాయిలో రూ. 32,830 కోట్ల టర్నోవర్ సాధించింది. బొగ్గు అమ్మకాల ద్వారా రూ. 28,459 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ. 4,371 కోట్లు వచ్చినట్లు యాజమాన్యం ప్రకటించింది. కానీ, నికర లాభాలను కేవలం రూ.1,227 కోట్లుగా చూపించింది. 2014తో పోలిస్తే టర్నోవర్ 3 రెట్లు పెరిగినా.. ఆ మేరకు లాభాలు పెరగకపోవడాన్ని కార్మిక సంఘాలు తప్పు పడ్తున్నాయి. ఉదాహరణకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ అమ్మకాల ద్వారా రూ. 4,371 టర్నోవర్ సాధించినట్టు చెప్తున్నా.. సింగరేణికి ట్రాన్స్‌కో నుంచి ఇప్పటి వరకు పైసా రాలేదు. ఇలాంటి మొండి బకాయిలకు తోడు సింగరేణి నిధులను సర్కారు మళ్లించడం వల్లే లాభాలను తక్కువగా చూపి కార్మికుల పొట్టగొడ్తున్నారనే ఆరోపణలున్నాయి. లాభాలు తక్కువగా వస్తుండడం, అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో క్రమంగా సింగరేణి సంస్థ అప్పుల్లోకి కూరుకుపోతున్నదని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
నెలనెలా జీతాలకు దిక్కులు..!
ప్రతి నెలా సింగరేణిలో అధికారులు, సిబ్బంది, కార్మికులకు దాదాపు రూ. 250 కోట్ల మేర జీతాలు ఇవ్వాలి. కానీ, సరిపడా ఫండ్స్ చేతిలో లేకపోవడంతో ఒకటో తారీఖు వస్తుందనగానే సింగరేణి ఆఫీసర్లు బ్యాంకుల వద్దకు పరుగుపెడ్తున్నారు. ఇట్లా జీతాల కోసం, పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు, కాంట్రాక్టర్ల చెల్లింపుల కోసం.. బాండ్లు, బ్యాంక్ బ్యాలెన్స్ఇప్పటికే కరిగిపోగా నెలనెలా కొత్త అప్పులు చేస్తున్నారు. కోల్ తవ్వకాలకు అవసరమయ్యే ముడిసరుకుకు, మెషీన్లు సరఫరా చేసే సంస్థలకు, ఓపెన్‌కాస్టు గనుల్లో ఓబీ పనులు చేసే కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయడం లేదు. నిజానికి సింగరేణిలో సివిల్, పర్చేజ్ డిపార్ట్మెంట్ సప్లయర్స్, సర్వీస్ ఓరియంటెడ్ సెక్షన్లకు సంబంధించి, హెవీ మెషినరీ సప్లయర్స్‌కు పేమెంట్స్ నిలిచిపోయాయి. తమకు సుమారు రూ. 500 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్పెట్టారని, ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నా బిల్లులు మాత్రం రావడం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. పరిస్థితి ఇట్లా ఉంటే బీఆర్ఎస్ పేరుతో ఏపీలోనూపాగా వేయాలని ప్రయత్నిస్తున్న సర్కారు పెద్దలు.. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్చేపట్టిన ఎక్స్ప్రెషన్ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లో పాల్గొనేందుకు సింగరేణిని ముందుపెట్టడంపై కార్మిక సంఘాలు మండిపడ్తున్నాయి. సొంత రాష్ట్రంలో కేంద్రం ఇటీవల నాలుగు బొగ్గు బ్లాకులకు వేలం పెడ్తే కనీసం టెండర్లు వేసే ధైర్యం చేయని సంస్థ.. వైజాగ్ స్టీల్‌లో పెట్టుబడులు పెట్టాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. సర్కారు పెద్దలు తమ ప్రయోజనాల కోసం సింగరేణి ఉసురుతీస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
వైట్ పేపర్ రిలీజ్ చేయాలె
రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి అప్పుల్లో కూరుకుపోతున్నది. ఏటా టర్నోవర్, లాభాలు ప్రకటిస్తున్న యాజమాన్యం.. అప్పుల గురించి ఎందుకు మాట్లాడ్తలేదు? సింగరేణి ఆర్థిక పరిస్థితిపై వెంటనే వైట్‌పేపర్ రిలీజ్ చేయాలి.
- పి. మాధవ్ నాయక్, ఏబీకేఎంఎస్(బీఎంఎస్) కార్యదర్శి
కార్మికులు నష్టపోతున్నరు..
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పొలిటికల్ స్టంట్మాత్రమే. అప్పులు, బకాయిలతో సతమతమవుతున్న సింగరేణికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తయ్? సింగరేణికి బకాయి పడ్డ రూ. 20 వేల కోట్లను ప్రభుత్వం మొదట ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. బకాయిలు రాకపోవడంతో జీతాల కోసం యాజమాన్యం ఇబ్బందులు పడుతున్నది. లాభాలను ప్రకటించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నరు. నాడు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ బిల్లుకు మద్దతిచ్చిన రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామంటే ఎట్లా నమ్మగలం? -వాసిరెడ్డి సీతారామయ్య, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి
సింగరేణి నుంచి రాష్ట్ర సర్కారు పెట్టిస్తున్న ఖర్చు