మూసేసిన ఓసీపీల్లో నీటి వనరులు .. భూగర్భ జలాల పెంపునకు సింగరేణి చర్యలు

మూసేసిన ఓసీపీల్లో నీటి వనరులు .. భూగర్భ జలాల పెంపునకు సింగరేణి చర్యలు
  • పాత చెరువులు, కుంటల్లోనూ పూడికతీత  
  • కొత్తగా మరో 15 మినీ చెరువుల నిర్మాణాలు  
  • తాగు, సాగు నీటి కొరత తీర్చేందుకు నిర్ణయం

కోల్​బెల్ట్,వెలుగు:తవ్వకాలు పూర్తయిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో భూగర్భ జలాల పెంపునకు సింగరేణి చర్యలు చేపట్టింది.  తాగు, సాగునీటి వనరులను పెంచేందుకు అనువైన ప్రదేశాల్లో చెరువులు, చిన్ననీటి వనరులను అభివృద్ధి చేసే పనులను కూడా మొదలుపెట్టింది. ‘సింగరేణి నీటి బిందువు– -జల సింధువు’ నినాదం ద్వారా ఆదిలాబాద్​ఉమ్మడి జిల్లాలో పనులకు శ్రీకారం చుట్టింది. మరోవైపు 6 పాత చెరువుల్లోనూ పూడికతీతకు నిర్ణయించింది. వీటిలో నీటి నిల్వలు చేయడం ద్వారా భూగర్భ జలాల పెంపుతోపాటు మత్స్యసంపద వృద్ధి, జీవరాసుల మనుగడ లక్ష్యంగా చర్యలు తీసుకోనుంది.
  
పాత చెరువుల్లో పూడికతీత 

బొగ్గు గనులకు సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని పాత చెరువులు, కుంటల అభివృద్ధికి గ్రామ పంచాయతీల నుంచి అనుమతి పొంది పనులు చేయనుంది. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో రెండు చొప్పున గుర్తించిన పాత చెరువుల్లో పూడికతీత చేపట్టనుంది. ఇప్పటికే ఓపెన్​కాస్ట్​గనుల తవ్వకాలు, విస్తరణతో వేల ఎకరాల్లో వ్యవసాయ భూములతో పాటు పెద్ద సంఖ్యలో చెరువులు కూడా నిర్వీర్యమయ్యాయి. ఏటా కురిసే వానలకు ఓబీ డంప్​యార్డు నుంచి వచ్చే నీటితో పాటు మట్టి చేరుతుండగా నీరు తగ్గిపోయి మైదానాలుగా మారిపోగా.. ఆయకట్టు తగ్గిపోవడంతో రైతులు నష్టపోతున్నారు.

నీళ్లు లేక మత్స్యసంపదపై ఆధారపడిన కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయి. దీంతో సింగరేణి సీఎండీ ఎన్​. బలరాంనాయక్​ భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇప్పటికే మూడు ఏరియాల్లోని చెరువుల్లో పూడికతీతకు స్థానిక ఆఫీసర్లు గుర్తించి నివేదికలు పంపించారు. 

కొత్తగా 15 మినీ చెరువులు 

బొగ్గు గనుల సమీప గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు సమ్మర్ లో జంతువులు, పక్షులు ఇతర జీవరాసుల మనుగడకు కొత్తగా15 చిన్న చెరువులు(కుంటలు) తవ్వనుంది. ఏరియాకు ఐదు చొప్పున  నిర్మించేందుకు ఇప్పటికే అధికారులు స్థలాలను ఖరారు చేశారు. శ్రీరాంపూర్​ఏరియా ఇందారం ఓసీపీ సమీపంలో మినీ చెరువు నిర్మాణ పనులను కూడా చేపట్టారు. వానాకాలంలో వీటిలో చేరిన నీటికి ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు చేస్తూ కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోనుంది.

 భవిష్యత్ లో వీటిని చేపలు పెంచడానికి కూడా వినియోగించుకోవచ్చని సింగరేణి భావిస్తోంది.  మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు తవ్వకాలు పూర్తయిన ఓపెన్​కాస్ట్​గనుల్లో సంపులు, మట్టి తొలగించిన లోతైన ప్రదేశాలను చెరువులుగా మార్చనుంది. ఓసీపీల్లోకి చేరిన వాన నీటిని బయటకు పంపకుండా వీటిలోకి మళ్లించేలా చర్యలు తీసుకోనుంది. తద్వారా భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని సింగరేణి పేర్కొంటుంది.130 ఏండ్లుగా భూగర్భ గనుల్లో బొగ్గుతో పాటు వెలువడే నీటిని పైపుల ద్వారా ఫిల్టర్​బెడ్లకు పంపించి, శుద్ధి చేసి కార్మికవాడలకు తాగునీటిని సప్లై చేస్తోంది. కొన్ని చోట్ల కాలనీల్లో వాటర్​ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి నీటిని అందిస్తోంది.  

గ్రౌండ్ వాటర్ ను పెంపొందిస్తాం..

సింగరేణి ఏరియాలో గ్రౌండ్ వాటర్ పెంపుతో పాటు సమీప గ్రామాల ప్రజలకు ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా ‘ నీటి బిందువు – -జల సింధువు’ నినాదంతో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటాం.  కొత్తగా 50 చిన్న చెరువులను నిర్మిస్తాం. పాత చెరువుల్లోనూ పూడిక తీయించి, అభివృద్ధి చేస్తాం. తద్వారా సింగరేణి ఏరియాలో గ్రౌండ్ వాటర్ పెరగనుంది. పూడికతీత పనుల్లో స్థానికులకు అవకాశాలు కల్పిస్తాం.

ఎన్​.బలరాంనాయక్, సీఎండీ, సింగరేణి  ​