సింగరేణిలో 50 మినీ చెరువులు .. నీటి బిందువు – జల సింధువు నినాదంతో ఏర్పాటు

సింగరేణిలో 50 మినీ చెరువులు .. నీటి బిందువు – జల సింధువు నినాదంతో ఏర్పాటు
  • పర్యావరణానికి ఊతమిచ్చేలా యాజమాన్యం నిర్ణయం 
  • భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక ప్రణాళిక అమలు 
  • క్లోజైన ఓపెన్​ కాస్ట్​ల్లో చేపట్టనున్న చెరువుల నిర్మాణాలు  
  • ఆదేశాలు జారీ చేసిన సంస్థ  సీఎండీ​ బలరామ్

హైదరాబాద్, వెలుగు: కోల్ బెల్ట్ ఏరియాలో భూగర్భ జల వనరుల పెంపుదలకు సింగరేణి  శ్రీకారం చుట్టింది. క్లోజ్ చేసిన ఓపెన్ కాస్ట్ మైనింగ్​ప్రాంతాల్లో 2  కిలోమీటర్ల పరిధిలో 50 మినీ చెరువుల నిర్మాణానికి నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న చెరువుల్లోనూ పూడికతీత పనులను చేపట్టనుంది. సింగరేణి ఏరియాలో భూగర్భ జలాల పెంపునకు ‘ సింగరేణి నీటి బిందువు– -జల సింధువు’ నినాదంతో పర్యావరణహిత ప్రోగ్రామ్ అమలు చేయనుంది. ఇంతకుముందే  గ్రీన్​రివెల్యూషన్​లో భాగంగా కోట్లాది మొక్కలు నాటి దేశవ్యాప్తంగానూ పేరు తెచ్చుకుంది. తాజాగా భూగర్భజలా లు పెంచి పంటలకు, జీవ రాసులకు ప్రయోజనం చేకూరేలా చేయనుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ సూచన మేరకు ప్లాన్ సిద్ధం చేస్తోంది.

గైడ్ లైన్స్ పై సీఎండీ వీడియో కాన్ఫరెన్స్

ఇందుకు సింగరేణి సీఎండీ బలరామ్​అన్ని ఏరియాల జనరల్​మేనేజర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి మాట్లాడారు. భూగర్భ జల వనరుల పెంపుదలకు మార్గదర్శకాలను ఖరారు చేశారు. మైనింగ్​ ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెంచడంతో పాటు సమీప గ్రామాల ప్రజలకు సమ్మర్ లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు  డి.సత్యనారాయణ రావు,  ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు , ఈడీ ఎస్ డీ ఎం.సుభానీ, ఫారెస్ట్ అడ్వైజర్  మోహన్ పరిగెన్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి నిర్ణయాలు ఇవే..

బొగ్గు తవ్వకాలు పూర్తయిన ఓపెన్ కాస్ట్ గనుల సంపుల్లో నీటిని నిల్వచేస్తూ సమీప ప్రాంతాల్లో నీటి వనరుగా డెవలప్ చేయాలి.  

  • ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ డంప్ ల మధ్య ఏర్పడే లోతైన ఖాళీ ప్రదేశాల్లో నీటిని నిల్వ చేయాలి. వీటిలో వర్షపు నీటితో పాటు, ఓపెన్ కాస్ట్​ల నుంచి బయటకు పంపించే నీటిని నింపాలి. ఇలా చేరిన నీరు వాడుకునేందుకు సివిల్ నిర్మాణ పనులు చేపట్టాలి.
  •  సింగరేణి గనుల ప్రాంతాల్లో  2 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే ఉన్న చెరువులు, కుంటలను అభివృద్ధి చేయాలి. వాటిలో ఎక్కువ నీరు నిల్వ ఉండేలా పూడిక తీసే పనులు చేపట్టాలి. దీనికి స్థానిక గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల ఆమోదం పొందడంతో పాటు పనుల్లో స్థానిక ప్రజలు పాల్గొనేలా చూడాలి.
  • సింగరేణి ఏరియాల్లో  జల వనరుల వృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలి. జల వనరుల పెంపుదలతో పాటు చేపలు, కప్పలు తదితర జీవరాసుల వృద్ధి,  పరిరక్షణ జరగాలి.
  • నీటిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ నాణ్యత పెంపుదలకు కూడా చర్యలు తీసుకోవాలి.