
- ఏటా 70 మిలియన్ టన్నులు సాధిస్తూ భాగస్వామ్యం
- ఈసారి వార్షిక ఉత్పత్తి టార్గెట్ కు తీవ్ర ప్రయత్నాలు
- మరో పది రోజులు మాత్రమే మిగిలిన గడువు
కోల్ బెల్ట్,వెలుగు: దేశీయ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కీలకంగా ఉంటూ ప్రతి ఏటా సుమారు 65 –- 70 మిలియన్‌టన్నులు ఉత్పత్తి చేస్తోంది. తాజాగా దేశంలో బొగ్గు ఉత్పత్తి 1 బిలియన్ (100 కోట్లు) టన్నులకు చేరుకుని కోల్ చరిత్రలో మరో మైలురాయిని దాటింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌చేశారు.
కోలిండియాలోని ఎనిమిది బొగ్గు కంపెనీలతో పాటు సింగరేణి కూడా కీరోల్ గా ఉంది. మరోవైపు సింగరేణి దక్షిణ భారత్ లోని పరిశ్రమల బొగ్గు అవసరాల ను తీర్చడమే కాకుండా తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించి రూ. వేల కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం దేశంలోని నవరత్న కంపెనీలకు దీటుగానూ నిలుస్తోంది.
దేశ బొగ్గు ఉత్పత్తిలో తనవంతుగా..
మోడ్రన్ టెక్నాలజీ, ఆధునిక పద్ధతులతో సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంచడమే కాకుండా సుస్థిరమైన ఉత్పత్తి, బాధ్యతాయుత మైనింగ్ నిర్వహిస్తోంది. 136 ఏండ్లుగా సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశ విద్యుత్ అవసరాలను తీర్చుతుంది. అంతేకాకుండా ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడుతూ సింగరేణి సక్సెస్ దిశగా సాగుతోంది. దేశీయంగా 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిలో తన వంతుగా సింగరేణి 22 అండర్ గ్రౌండ్, 18 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా సుమారు 65 నుంచి 70 మిలియన్ టన్నుల భాగస్వామ్యాన్ని అందించింది.
వార్షిక టార్గెట్ చేరుకునేందుకు ప్రయత్నాలు
సింగరేణి 2024– -25వార్షిక సంవత్సరానికి నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల(720లక్షల టన్నులు) బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంస్థ కార్మికులు, ఆఫీసర్లు సమష్టిగా కష్టపడుతున్నా రు. లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో 10 రోజుల సమయం ఉంది. అయితే.. శుక్రవారం నాటికి 65.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో 95 శాతానికి చేరింది. టార్గెట్ రీచ్కావాలంటే మరో 6.40 మిలియన్ టన్నులు వెలికితీయాలి.
దీంతో రోజూ సుమారు 3 లక్షల టన్నుల ఉత్పత్తికిగాను 3.1లక్షల టన్నులు సాధిస్తే నెలాఖరునాటికి మరో 3 –4 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే చాన్స్ ఉంది. తద్వారా వార్షిక ఉత్పత్తి టార్గెట్ చేరుకోలేనప్పటికి 69 –70 మిలియన్ టన్నులు సాధ్యమయ్యే పరిస్థితి ఉంది. గతేడాది సంస్థ 70.2 మిలియన్‌టన్నుల ఉత్పత్తిని సాధించింది.
గడువు పూర్తిలోపు..
ఈసారి ఇల్లందు ఏరియాలో 105 శాతం, రామగుండం101 శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని మించి దాటింది. మణుగూరు ఏరియాలో 99 శాతం, రామగుండం-–1 ఏరియాలో 98శాతం, రామగుండం–-2 , బెల్లంపల్లి ఏరియాల్లో 97శాతం, కొత్తగూడెం ఏరియాలో 96 శాతం ద్వారా వార్షిక ఉత్పత్తికి సమీపంలోకి వచ్చింది.
గడువు పూర్తిలోపు ఆయా ఏరియాల్లో మరింత బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు ఇతర ఏరియాల్లో పుంజుకుంటే టార్గెట్‌పై ఆశలు ఉంటాయని సింగరేణి మేనేజ్ మెంట్ పేర్కొంటుంది. ఇప్పటికే సంస్థ వ్యాప్తంగా 7 – 8 గనులు వందశాతం బొగ్గు ఉత్పత్తిని సాధించాయి.