వేజ్‌‌‌‌ బోర్డు ఏరియర్స్‌‌ ఇంకెప్పుడిస్తరు!

  • కోల్​ ఇండియా ఓకే చెప్పినా స్పందించని సింగరేణి
  • ఒక్కో కార్మికుడికి రూ.2 లక్షల నుంచి 8లక్షలు రావాలి

గోదావరిఖని, వెలుగు:కార్మికులకు 11వ వేజ్‌‌‌‌బోర్డుకు సంబంధించిన ఏరియర్స్ చెల్లించే విషయంలో సింగరేణి యాజమాన్యం స్పందించడం లేదు. వచ్చే నెలలో ఆగస్టుతో కలిపి మొత్తం 23 నెలలకు ఏరియర్స్ ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు. 

కోల్‌‌‌‌ ఇండియా పరిధిలోని ఎనిమిది సబ్సిడరీ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏరియర్స్ చెల్లించాలని ఇటీవల సర్క్యులర్ ​జారీ అయింది. సింగరేణి పరిధిలో వేజ్‌‌‌‌బోర్డు ఏరియర్స్‌‌ కోసం మరికొన్నాళ్లు ఎదురుచూపులు తప్పవా అంటూ కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యం స్పందించి సెప్టెంబర్​లో వేస్తే ఒక్కో కార్మికుడికి రూ.2 లక్షలు నుంచి రూ.8 లక్షలు అందనున్నాయి.  

25 శాతం అలవెన్సులు

దేశంలోని కోల్‌‌‌‌ఇండియా, సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి ఐదేండ్లకు ఒకసారి ‘నేషనల్‌‌‌‌ కోల్‌‌‌‌ వేజ్‌‌ అగ్రిమెంట్‌‌‌‌(ఎన్‌‌‌‌సీడబ్ల్యూఏ)’ అమలు అవుతుంది. 2021 జులై నుంచి11వ వేజ్‌‌‌‌ బోర్డు అమలు కావాల్సి ఉండగా, జాతీయ కార్మిక సంఘాలు, కోల్‌‌‌‌ఇండియా, సింగరేణి సంస్థలతో కలిపి జేబీసీసీఐ(జాయింట్‌‌‌‌ బై పార్టియేటెడ్‌‌‌‌ కమిటీ ఫర్‌‌‌‌ కోల్‌‌ ఇండస్ట్రీ) కమిటీ వేయడం లేట్​అవడంతో ఏరియర్స్ ​పెరిగిపోయాయి. జాతీయ సంఘాలు కలిసి రూపొందించిన డిమాండ్ల నోటీసు‌‌ను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు ఇచ్చిన తర్వాత చాలాసార్లు మీటింగు‌‌లు జరిగాయి. చివరకు 2023 మే నెల 20వ తేదీన 11వ వేజ్​బోర్డు ఒప్పందాన్ని ఓకే చేశారు. దాని ప్రకారం19 శాతం వేతనం కనీస పెరుగుదలతోపాటు 25 శాతం అలవెన్స్ లు పెరిగాయి. 

బేసిక్​ ఆధారంగా..

11వ వేతన ఒప్పందం ప్రకారం సింగరేణి సంస్థ 2021జులై 1 నుంచి ఆగస్టు వరకు పెంచిన వేతనాలు, అలవెన్స్‌‌‌‌లను కార్మికులకు చెల్లించాల్సి ఉంది. కోల్‌‌‌‌ఇండియా పరిధిలోని సబ్సిడరీ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు ఆగస్టు వేతనాలతో కలిపి వచ్చే సెప్టెంబర్‌‌‌‌ నెలలో 23 నెలల ఏరియర్స్‌‌‌‌ను ఒకేసారి ఇవ్వనున్నట్లు అక్కడి మేనేజ్‌‌‌‌మెంట్‌‌ఈ నెల రెండో తేదీన సర్క్యులర్‌‌‌‌ జారీ చేసింది. సింగరేణి యాజమాన్యం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

బొగ్గు ఉత్పత్తి, రవాణాలో మేటిగా ఉన్నామని ప్రకటించుకొంటూ, రూ.కోట్ల టర్నోవర్‌‌‌‌ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నా ఆర్థిక నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సింగరేణి నుంచి బొగ్గు, కరెంట్‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నందుకు రూ.22 వేల కోట్ల బకాయి పడిందని, ప్రభుత్వం చెల్లిస్తే కార్మికులకు ఏరియర్స్ ​వేసేందుకు ఈజీ అవుతుందని చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌‌‌‌ రాకముందే సింగరేణి సంస్థకు బకాయిలు జమ చేయాలని లీడర్లు కోరుతున్నారు. 

లేట్​ చేయడం కరెక్ట్​కాదు

సింగరేణి కార్మికులకు 23 నెలల ఏరియర్స్‌‌‌‌ చెల్లించాలి. ఇప్పటివరకు యాజమాన్యం స్పందించకపోవడం శోచనీయం. సింగరేణిని ఏటీఎంలా వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవాలి. బకాయిలు చెల్లించాలి. లేట్​చేయడం కరెక్ట్​కాదు. 
- పి.మల్లికార్జున్‌‌‌‌, బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌