
- ఇప్పటికే అండర్ మైన్ గనుల్లో విమెన్ మైనింగ్ ఆఫీసర్లు
- యాజమాన్యం నిర్ణయాన్ని స్వాగతిస్తున్న మహిళా ఉద్యోగులు
కోల్ బెల్ట్/గోదావరిఖని, వెలుగు: మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా రెండు బొగ్గు గనులు కేటాయించేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. ప్రస్తుతం సర్ఫేస్లోని అన్ని విభాగాలతో పాటు అండర్ గ్రౌండ్మైన్స్ లోనూ విమెన్ మైనింగ్ఆఫీసర్లు డ్యూటీలు చేస్తున్నారు. మరోవైపు రెండు మహిళా రెస్క్యూ టీమ్ ల ఏర్పాటుకు కూడా ప్లాన్ రెడీ అయింది. ఇలాంటి దశలో పూర్తిగా మహిళా ఉద్యోగులతోనే బొగ్గు గనులను నడిపించాలనే సింగరేణి నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో తాము సత్తా చాటుతామని పలువురు మహిళా ఉద్యోగులు పేర్కొంటున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం
గనుల్లో బొగ్గు తవ్వడం శారీరక శ్రమతో కూడినది. అంతేకాదు వందల అడుగుల లోతులో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య పని చేయడం సవాల్ కూడా. ఇలాంటి కష్టం చేయలేరనే ఉద్దేశంతో ఏడేండ్ల కింద వరకు సింగరేణి ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. పురుషులకే ఉద్యోగాలు పరిమితం చేయడం సరికాదంటూ మహిళలకు కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలతో సింగరేణి మహిళలకు జాబ్ లు ఇవ్వడం ప్రారంభించింది.
దీంతో ఇప్పటికే వేలాది మంది మహిళలు వారసత్వ ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం వివిధ హోదాల్లో సుమారు 2 వేల మంది విధుల్లో ఉన్నారు. బదిలీ వర్కర్నుంచి జనరల్మజ్దూర్హోదాలో జీఎం ఆఫీస్‌లు, డిపార్ట్మెంట్లు, ఏరియా ఆస్పత్రులు, వర్క్‌షాపులు, స్టోర్స్, బొగ్గు గనుల్లో పని చేస్తున్నారు. వీరిలో డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వారు ఉన్నారు. ఉన్నత స్థాయి చదువులు చదివినా జనరల్మజ్దూర్గానే బాధ్యతల్లో ఉండడంపై కొందరు మహిళా ఉద్యోగులు అనాసక్తితో ఉండడంతో సింగరేణి అర్హత ఆధారంగా ఇటీవల కౌన్సిలింగ్నిర్వహించింది.
16 రకాల డిసిగ్నేషన్లతో నియామకం చేసింది. సింగరేణి వ్యాప్తంగా సీఎండీ పర్యటన సందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులు ఓసీపీల్లో ఎంతో శ్రమతో కూడిన డంపర్వాహనం నడిపే పని కూడా ఇవ్వాలంటూ కోరుతూ ముందుకురావడం కూడా ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కొద్ది నెలల కిందట 109 మంది జూనియర్మైనింగ్ట్రైనీలుగా(మహిళా ఇంజనీర్లు) విధుల్లో చేరారు. వీరిలో ఎలక్ర్టికల్, మైనింగ్, మెకానికల్ ఇంజనీర్లు ఉన్నారు.
రెండు గనుల నిర్వహణ బాధ్యతలు
సింగరేణిలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా ప్రత్యేకంగా రెండు గనుల నిర్వహణ బాధ్యతలను ఇచ్చేందుకు సీఎండీ ఎన్. బలరాంనాయక్ నిర్ణయించారు. మహిళలతో గనుల నిర్వహణ ఎలా చేపట్టాలనే దానిపైనా స్టడీ చేయించారు. బొగ్గు గనిని నడిపించేందుకు మహిళా ఉద్యోగులున్నారా? అని ఆరా తీశారు. తగినంత మంది నిపుణులైన మహిళా ఉద్యోగులు లేకుంటే ఒక షిఫ్ట్ లోనైనా నడపాలనే ఆలోచన చేశారు. ఇందుకు ప్రయోగాత్మకంగా ఒక అండర్‌గ్రౌండ్, ఒక ఓపెన్‌కాస్ట్ గని నిర్వహణ కేటాయించాలని నిర్ధారించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి సీఎండీ కీలక ప్రకటన చేశారు. దీంతో రెండు గనుల్లో ఒక్కో షిఫ్ట్ ను మహిళా ఉద్యోగుల నిర్వహణకు ఇచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 11 ఏరియాల్లో బొగ్గు గనులు విస్తరించి ఉండగా.. వివిధ హోదాల్లో 2 వేల మందికి పైగా ఉన్నారు. మరోవైపు ఏయే గనులు నడిపే బాధ్యతలు ఇస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది. రామగుండం, బెల్లంపల్లి రీజియన్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడనే ప్రయారిటీ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై మరో రెండువారాల్లోగా క్లారిటీ రానుంది.
సింగరేణి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
షిఫ్ట్ లో మహిళలతో గనిని నడిపిస్తే ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించవచ్చు. ప్రస్తుతం మహిళా కార్మికుల సంఖ్య తక్కువగా ఉంది. మహిళలకు గనులు కేటాయించేందుకు సీఎండీ సార్ మంచి ఆలోచన చేశారు. మహిళలంతా ఒకే చోట పని చేస్తుంటే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మహిళలకు రక్షణ ఇచ్చినట్లు ఉంటుంది. యాజమాన్యం ఆలోచనను స్వాగతిస్తున్నాం.- సంజన, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, జీడీకే 11 ఇంక్లైయిన్, గోదావరిఖని