- షాఫ్ట్ లిఫ్ట్ లను ఏర్పాటు చేసేందుకు సింగరేణి సన్నాహాలు
- ఒక్కో మైన్ లో లిఫ్ట్ ల ఏర్పాటుకు రూ.100 కోట్లు ఖర్చు
- కొత్త టెక్నాలజీతో టైమ్ ఆదాతో పాటు పెరగనున్న ఉత్పత్తి
హైదరాబాద్, వెలుగు : అండర్గ్రౌండ్మైన్లలో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడానికి సింగరేణి సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం కార్మికులను గనుల లోపలికి తీసుకెళ్లడానికే గంటలకొద్దీ టైమ్ పడుతున్నది. 8 గంటల డ్యూటీలో సగం టైమ్ దానికే పోతున్నది. దీంతో ఉత్పత్తి తగ్గి సంస్థకు నష్టం చేకూరుతున్నది. ఈ నేపథ్యంలో కార్మికులను గనుల లోపలికి తీసుకెళ్లే టైమ్ ను తగ్గించుకుని, నష్టాలను తగ్గించుకోవాలని సింగరేణి ప్రయత్నాలు చేస్తున్నది. కార్మికులను నేరుగా మైనింగ్ జరిగే ప్రాంతానికి తరలించడం ద్వారా సమయం కలిసి వస్తుందని, ఇందుకోసం భారీ లిఫ్ట్తరహాలో షాఫ్ట్ అనే కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది.
అడ్రియాలా మైన్ లో అమలు..
అడ్రియాలా మైన్, దాని పరిసర ప్రాంతాల్లోని మైన్లలో ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని సింగరేణి భావిస్తున్నది. అదే విధంగా రామగుండం పరిధిలోని యూజీ మైన్‌లో ఎక్కువ మందిని తరలించే లిఫ్ట్తరహా షాఫ్ట్టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. బొగ్గు తవ్వే ప్రాంతానికి బోర్తరహాలో భారీ డ్రిల్లింగ్‌చేసి నేరుగా లిఫ్ట్ లాంటి ఏర్పాట్లు చేస్తారు. ఇలాంటి లిఫ్ట్షాఫ్ట్ టెక్నాలజీ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది కార్మికులను నేరుగా మైనింగ్ చేసే ప్రాంతానికి తరలిస్తుంది. ఈనేపథ్యంలో షాఫ్ట్ లిఫ్ట్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో టైమ్ఆదా కావడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుదని అధికారులు అంటున్నారు. ఒక్కో మైన్‌లో ఈ లిఫ్టుల ఏర్పాటుకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
ఏటా రూ.2,200 కోట్లు మిగులు..
అండర్ గ్రౌండ్మైన్లలో బొగ్గు తవ్వడం, వెలికి తీయడంలో జాప్యం కారణంగా ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటున్నది. యూజీ మైన్‌కు ఇచ్చిన టార్గెట్‌లో కనీసం సగం రావడం కూడా కష్టంగా మారుతున్నది. ఫలితంగా సింగరేణి పరిధిలోని ఆరు ఏరియాల్లో ఉన్న 22 అండర్ గ్రౌండ్ మైన్లలో కలిపి ఏడాదికి రూ.2,249 కోట్ల నష్టం వస్తున్నది. ఇక్కడ ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండడమే నష్టాలకు కారణం. ఈ నేపథ్యంలో కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నష్టాలు భరిస్తూనే, కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి సింగరేణి ప్రయత్నాలు చేస్తున్నది.
టార్గెట్ 77 మిలియన్ టన్నులు..
సింగరేణి 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 77 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని టార్గెట్ పెట్టుకుంది. రాష్ట్రంలో ఉన్న 44 బొగ్గు గనుల నుంచి 72 మిలియన్ టన్నులు, ఒడిశాలోని నైనీ బ్లాక్ద్వారా 5 మిలియిన్ టన్నులు వెలికి తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వేగంగా బొగ్గును ఉత్పత్తి చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నది.