
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి మెయిన్ఆస్పత్రిని సూపర్‌స్పెషాలిటీ గా మారుస్తామని సీఎండీ ఎన్. బలరాం నాయక్పేర్కొన్నారు. ఏడాదికి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నా నాణ్యమైన వైద్యం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రిఫరల్స్ సంఖ్య తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ఏడాదికి రూ. 150కోట్లు రిఫర్కేసుల్లో భాగంగా కార్పొరేట్ ఆస్పత్రులకు కడుతున్నట్టు చెప్పారు.
సోమవారం ఆయన కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ ఆస్పత్రి ఆవరణలో రూ. 3.46కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజ్ కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించి మాట్లాడారు. రామగుండంలోని సింగరేణి ఆస్పత్రిని కూడా సూపర్‌స్పెషాలిటీ గా చేస్తామని, ఆ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కొత్తగూడెంలోని నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌కోర్సును ప్రారంభించి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇప్పటివరకు 825 మంది చదువుకోగా.. ఇందులో 500 మంది సింగరేణి ఆస్పత్రుల్లో, 200 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 153 మంది విదేశాల్లో, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జాబ్ లు చేస్తుండడం అభినందనీయమన్నారు. వైద్య వృత్తి దైవంతో సమానమన్నారు. సేవా భావంతో నర్సింగ్స్టూడెంట్స్పని చేయాలన్నారు. త్వరలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్‌ను ప్రారంభించబోతున్నామన్నారు.
కార్యక్రమంలో డైరెక్టర్లు డి. సత్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, ఎల్వీ. సూర్యనారాయణ, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులు ఎస్వి. రమణమూర్తి, త్యాగరాజన్, కార్పొరేట్ సీఎంఓఏఐ ప్రెసిడెంట్ వెంకటాచారి, సీఎంఓ సుజాత, జీఎం పర్సనల్ కవితా నాయుడు, పలు విభాగాల జీఎంలు పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో జమ్మిచెట్టును నాటారు. రిటైర్అవుతున్న సీఎంఓ సుజాతను సన్మానించారు.
రొంపేడు, వీకేవోసీ నైనీ బొగ్గు బ్లాకుల్లో త్వరలో బొగ్గు ఉత్పత్తి
సత్తుపల్లి: కొత్తగూడెంలో వీకేఓసీ, ఇల్లందు ఏరియా రొంపేడుతో పాటు ఒడిశాలోని నైనిలో త్వరలోనే మైనింగ్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. జేవీఆర్ఓసీ గనిని ఆయన ఆకస్మికంగా సందర్శించి ఉత్పత్తి, ఉత్పాదకత, సరఫరా, రక్షణ వంటి పలు అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్లోబల్ డిమాండ్ దృష్ట్యా రాజస్థాన్ లో 3100 మెగా వాట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అగ్రిమెంట్ జరిగిందని, ఆస్ట్రేలియాలో కూడా విస్తరించి గ్లోబల్ గా సింగరేణి గుర్తింపు పొందనుందని పేర్కొన్నారు.
సింగరేణిలోనే అధికంగా112 లక్షల టన్నుల లక్ష్యాన్ని సాధించిన జేవీఆర్ఓసీ అధికారులు, కార్మికులు, సంఘాల నేతలను అభినందించారు. సమష్టి కృషితోనే విజయం సాధ్యమైందని, త్వరలోనే సత్తుపల్లి ఏరియాకు కొత్త జీఎం ను నియమిస్తామని పేర్కొన్నారు. జీఎం ఆఫీసు పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కృష్టారం సింగరేణి బాధితులు సీఎండీకి పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. ఆయన వెంట డైరెక్టర్ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, జీఎం శాలెం రాజు, ఏజీఎం రామకృష్ణ, పీఓ ప్రహ్లాద్, నరసింహా రావు, కోటి రెడ్డి తదితరులు ఉన్నారు.