ఈ నెల 20, 21న సింగరేణి  లాభాల వాటా చెల్లింపునకు నిర్ణయం!

  • ఈ నెల 20, 21న సింగరేణి  లాభాల వాటా చెల్లింపునకు నిర్ణయం!
  • పర్మిషన్ ​కోసం ప్రిన్సిపల్  సెక్రటరీని కలిసిన యాజమాన్యం
  • అధికారికంగా ప్రకటించని మేనేజ్ మెంట్
  • కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో దిద్దుబాటు చర్యలు

కోల్​బెల్ట్, వెలుగు : ఎన్నికల కోడ్​ పేరుతో నిలిపివేసిన సింగరేణి కార్మికుల లాభాల వాటా, దసరా అడ్వాన్స్​ను ఈనెల 20 లేదా 21న  చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. లాభాల వాటా చెల్లించాలని డిమాండ్  చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో పాటు ఈనెల 21న ఒకరోజు టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడంతో యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. బుధవారం సింగరేణి డైరెక్టర్ ఎన్ వీకే శ్రీనివాస్ (ఆపరేషన్స్), జీఎం జి.సురేశ్ (కోఆర్డినేషన్) సెక్రటేరియట్​లో రాష్ట్ర ప్రిన్సిపల్​ సెక్రటరీని కలిశారు. లాభాల వాటా, పండుగ అడ్వాన్స్​ చెల్లింపు సమస్య పరిష్కారం కాకపోతే కార్మిక సంఘాలు సమ్మె చేసే చాన్స్​ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

లాభాల వాటా, పండగ అడ్వాన్స్​చెల్లించేందుకు పర్మిషన్​ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన ప్రిన్సిపల్​ సెక్రటరీ.. ఈనెల 21లోపు వాటాల చెల్లింపునకు పర్మిషన్​ఇస్తామని, ఆలోపు యాజమాన్యం పేషీట్స్, డబ్బులు రెడీగా ఉంచుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ విషయాన్ని టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, బీఎంఎస్ యూనియన్ల స్టేట్​ ప్రెసిడెంట్లు బి.వెంకట్రావు, వాసిరెడ్డి సీతారామయ్య, యాదగిరి సత్తయ్య వేర్వేరుగా ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 21లోపు లాభాల వాటా, పండగ అడ్వాన్స్​ చెల్లించకపోతే కార్మికవర్గం టోకెన్​ సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ లీడర్లు సూచించారు.

ఎలక్షన్​ కమిషన్ ​ఉత్తర్వులను చూపాలె

సింగరేణి కార్మికుల లాభాల వాటా చెల్లింపులు నిలిపివేయాలని సింగరేణి యాజమాన్యానికి ఎలక్షన్​కమిషన్​ ఆదేశాలు జారీచేసి ఉంటే వాటిని కార్మికులకు చూపాలని కార్మిక సంఘాల లీడర్లు డిమాండ్​చేశారు. బుధవారం మందమర్రి ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, టీజీఎల్​బీకేఎస్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, ఐఎఫ్ టీయూ, ఏఐఎఫ్ టీయూ, కాంట్రాక్ట్​ కార్మికుల సంఘం లీడర్లు పార్వతి రాజిరెడ్డి, మణిరాం సింగ్, ఎండీ చాంద్  పాషా, జాఫర్, నీరటి రాజన్న, దేవిసత్యం, జైపాల్, టి.శ్రీనివాస్, పోషమల్లు తదితరులు మాట్లాడారు. సర్కారుకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు సింగరేణి యాజమాన్యం ఎన్నికల కోడ్​ను సాకుగా చూపి లాభాల వాటా, పండుగ అడ్వాన్స్​ చెల్లింపును వాయిదా వేసిందని వారు  మండిపడ్డారు.