సింగరేణికి ‘అటవీ’ గండం!  

సింగరేణికి ‘అటవీ’ గండం!  
  • గనుల వేలం విధానంతో సింగరేణికి కష్టాలు
  • గనుల విస్తరణకు పర్మిషన్ ఇవ్వని ఫారెస్ట్​, ఎన్విరాన్​మెంట్​
  • ఏండ్లకేండ్లు ఎదురుచూపులు వరుసగ మూతపడుతున్న గనులు

కోల్​బెల్ట్, వెలుగు:  డిమాండ్​కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి చేస్తున్న ప్రయత్నాలకు ఫారెస్ట్, ఎన్విరాన్​మెంట్ పర్మిషన్లు అడ్డంకిగా మారుతున్నాయి. రాను న్న కాలంలో100 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు వేసుకున్న సింగరేణికి కొత్త గనులు ఏర్పాటు తప్పనిసరయ్యింది. కేంద్రం బొగ్గు గనుల వేలం విధానం అమల్లోకి తీసుకురావడంతో వాటిని దక్కించుకోలేని సింగరేణి.. కనీసం ఉన్న గనులను అయినా విస్తరించుకుందామంటే ఫారెస్ట్, ఎన్విరాన్​మెంట్​శాఖలు అనుమతులివ్వడం లేదు.

సింగరేణి గతంలో తీసుకున్న అనుమతులకు పొడిగింపుతో పాటు విస్తరణకు దరఖాస్తు చేసుకుంటే ఉత్తర ప్రత్యుత్తరాలకే ఏండ్లు పడుతోంది. అదే ఒక ప్రైవేటు కంపెనీ పర్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల వ్యవధిలోనే అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో కొత్త గనుల కేటాయింపు లేక, విస్తరణ గనులకు పర్మిషన్లు రాక సింగరేణిలో వరుసగా గనులు మూతపడుతున్నాయి. దీంతో కార్మికవర్గం ఆందోళన చెందుతోంది.

తాజాగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియా ఆర్కే-7 గనిలోని ఒక సెక్షన్ ​పని స్థలానికి పర్మిషన్ ​లేదంటూ ఫారెస్ట్ ​అధికారులు మూసివేయించారు. మరోవైపు ఆర్కేపీ ఓసీపీ ఎక్స్​టెన్షన్​కు పర్మిషన్ ​రాకపోవడంతో మూడు నెలల్లో మూతపడనుంది. డివిడెంట్​ రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.3 వేల కోట్లకు పైగా, కేంద్రానికి రూ.4 వేల కోట్లకు పైగా ఇస్తున్నా సింగరేణి ప్రాధాన్యత లేకుండా పోతోంది. 

మూసివేసిన వాటి స్థానంలోనే..

సింగరేణికి కొత్తగా బొగ్గు బ్లాక్​ల కేటాయింపులు లేకపోవడంతో టార్గెట్లను సాధించడం కోసం గతంలో మూసివేసిన అండర్​గ్రౌండ్​ మైన్ల స్థానంలో ఓసీపీలను విస్తరిస్తోంది. దీనికి పెద్దగా పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరముండదు. ఓసీపీ ఏర్పాటు కూడా ఈజీగా అయిపోతుంది. ఇలా కొత్తగా ఏడు ఓసీపీలకు అండర్​ గ్రౌండ్​ మైన్ల భూములుండగా, మరికొంత అటవీ, ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉంటుంది. వీటికి పర్యావరణ, అటవీశాఖ పర్మిషన్లు వస్తే సరిపోతుంది. గనుల విస్తరణ కావడంతో పర్మిషన్లు తొందరగా వస్తాయని సింగరేణి భావిస్తుండగా ఫారెస్ట్​, ఎన్విరాన్​మెంట్​శాఖలు మాత్రం  చాలా ఏండ్ల టైం తీసుకుంటున్నాయి.

విస్తరణ గనులకు పర్మిషన్లు వస్తే ఐదేండ్లలో మరో ఏడు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి 100 మిలియన్​ టన్నుల టార్గెట్​సాధించాలని సింగరేణి భావించింది. ఇందులో భాగంగా ఏటా 5 మిలియన్​టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే కెపాసిటీ కలిగిన వీకే కోల్​మైన్స్, ఇల్లెందు ఏరియాలోని రొంపేడు జేకే ఓసీపీ(2మిలియన్​టన్నులు), బెల్లంపల్లి ఏరియాలో ఎంవీకే ఓసీపీ(2మిలియన్​టన్నులు), గోలేటి ఓసీపీ(3మిలియన్​టన్నులు), భూపాలపల్లి ఏరియాలోని పీవీఎన్​ఆర్​ వెంకటాపూర్​ (2 మిలియన్​ టన్నులు), మందమర్రి ఏరియాలోని ఆర్కేపీ ఓసీపీ ఎక్స్​టెన్షన్​ మైన్(2మిలియన్​టన్నులు), మణుగూరు ఓసీపీ ఎక్స్​టెన్షన్(2మిలియన్​ టన్నులు), రామగుండం జీడీకే10 ఓసీపీ (6 మిలియన్​ టన్నులు) కెపాసిటీ బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్లాన్లు రూపొందించుకుంది.

వీటిలో కొన్ని గనులకు పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ కూడా పూర్తయ్యింది. ఏండ్ల కిందట ఫారెస్ట్​, ఎన్విరాన్​మెంట్​పర్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నా నేటికీ అనుమతులు రాలేదు.  ఇవి కాకుండా 2మిలియన్​టన్నుల కెపాసిటీ ఉన్న శ్రీరాంపూర్​ ఏరియాలో ఆర్కే-5,6 గనులను కలిపి  మెగా ఓసీపీ, కేకే5 గనిని ఓసీపీ, ఆర్కే7- ఆర్కే న్యూటెక్​ గనుల ఓసీపీ,  భూపాలపల్లి కేటీకే ఓసీపీలో అడ్రియాల ప్రాజెక్టు తరహాలో భూగర్భగని( 30లక్షల టన్నులు) ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రూపొందించింది.  

​కొర్రీలతో మూత  

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్కే-7 గనికి సంబంధించిన అటవీశాఖ లీజ్​ పొడిగింపుకు పర్మిషన్​ ఇవ్వకపోవడంతో రెండు రోజుల కిందట ఒక సెక్షన్​మూసివేతతో గని భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గని అటవీశాఖ పరిధిలోని 929 ఎకరాల  భూముల లీజ్(ఇందారం మైన్​లీజ్​)​ పొడిగింపు పర్మిషన్​ కోసం 2018లో సింగరేణి యాజమాన్యం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు(ఎంఓఈఎఫ్​అండ్​సీసీ- మినిస్ర్టీ ఆఫ్​ఎన్విరాన్​మెంట్, ఫారెస్ట్​ అండ్​ క్లైమేట్​ చేంజ్) మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసిన నేటికీ పర్మిషన్​ రాలేదు.

అటవీశాఖ ఉన్నతాధికారులు కొర్రీలు పెట్టి వెనక్కి పంపిస్తున్నట్లు తెలిసింది. చివరకు మూడు రోజుల కిందట పర్మిషన్లు లేవంటూ ఫారెస్ట్​ అధికారులు ఆర్కే-7 గనిలోని కీలక పనిస్థలం మూసివేయించారు. మరోవైపు మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఓపెన్​కాస్ట్​ మైన్​ ఎక్స్​టెన్షన్ పర్మిషన్​​ కోసం కూడా యాజమాన్యం ఏడాదిన్నర కిందట సెంట్రల్ ​ఫారెస్ట్​, ఎన్విరాన్​మెంట్​డిపార్ట్​మెంట్​కు అప్లై చేసుకుంది. ఇప్పటి వరకు పర్మిషన్లు రాలేదు. మరో మూడు,నాలుగు నెలలు గడిస్తే ఆ గని కూడా ​మూతపడనుంది.