
- ఒడిశాలో గని ఏర్పాటు తెలంగాణకు గర్వకారణం: భట్టి
- ప్రజాభవన్ నుంచి నైనీ బ్లాక్ వర్చువల్‌గా ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: నైనీ బ్లాక్ ప్రారంభంతో సింగరేణి ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టిందని, ఇతర దేశాలకు సైతం విస్తరించి త్వరలో గ్లోబల్ కంపె నీగా రూపుదిద్దుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారి వేరే రాష్ట్రంలో బొగ్గుగనిని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని ఆయన పేర్కొన్నారు. బుధవారం ప్రజా భవన్ నుంచి ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్‌ను డిప్యూటీ సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఒడిశాలో నైనీ గనిని ప్రారంభించడం తెలం గాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
ఈ బ్లాక్ సింగరేణికి కేటాయించి తొమ్మిదేండ్లయినా అనుమతులు రాక జాప్యం జరిగిందన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, తాను సెంట్రల్ కోల్ మినిస్టర్‌ను పలుమార్లు కలిసి అనుమతులు సాధించామన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఏడాదిలోనే నైనీని ప్రారంభించుకోవడం ప్రజా ప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. నైనీ గని ప్రారంభానికి సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, స్థానిక ఎమ్మెల్యే అగస్థీ బెహ రాలకు ఈ సందర్భంగా భట్టి కృతజ్ఞతలు తెలిపారు.
అంగూల్ అభివృద్ధికి కృషి..
గతేడాది జులైలో ఒడిశా పర్యటన సందర్భంగా అంగూల్ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన ప్రతీ హామీని సింగరేణి అమలు చేస్తుందని భట్టి తెలిపారు. సింగ రేణి ప్రభుత్వ రంగ సంస్థ అని, కేవలం వాణిజ్యం కోసం పనిచేసే కంపెనీ కాదన్నారు. సామాజిక స్పృహతో అంగూల్ ప్రాంతంలో కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజల ఉపాధి మరింత మెరుగుపరిచేందుకు 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నైనీకి సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. స్థల సేకరణకు ఒడిశా ప్రభుత్వం సహకరించాలని కోరారు. నైనీ బొగ్గు గని వద్ద జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అగస్థీ బెహరా మాట్లాడుతూ.. అంగూల్ అభివృద్ధికి సింగరేణి సహకరించాలని కోరారు. సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం చూపిన ప్రత్యేక చొరవతో నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభించుకో గలిగామని అన్నారు.