సింగరేణి నైనీ పనులు స్పీడప్: సీఎండీ బలరాం

సింగరేణి నైనీ పనులు స్పీడప్: సీఎండీ బలరాం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఆధ్వర్యంలో ఒడిశాలో చేపట్టిన నైనీ కోల్​మైన్ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది సెకండ్ క్వార్టర్ చివరి నాటికి  బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ నైనీ బ్లాక్ సమీపంలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తింపు కోసం సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం సింగరేణి సీఎండీ ఒడిశా రాష్ట్ర సీఎస్ ప్రదీప్ కుమార్ జెనాతో ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. 

ఈ సందర్భంగా  నైనీ బ్లాక్ కు అన్ని  అనుమతులు లభించిన విషయాన్ని, అదే విధంగా రెండో దశ అనుమతులకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా సింగరేణి చేపట్టిన చర్యలు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఒడిశా ప్రభుత్వం కోరినట్లుగా వన్యప్రాణి నిర్వహణ ప్రణాళిక కోసం రూ.39 కోట్లను డిపాజిట్ చేశామని, ఇప్పటి వరకు రూ.180 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రారంభం కోసం కావాల్సిన 783 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి బదలాయించాలని బలరాం, ఒడిశా సీఎస్​ను కోరారు. సింగరేణి ఆధ్వర్యంలో నైనీ ప్రాజెక్టుకు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.

విద్యుత్​ ప్లాంటు కోసం 800 ఎకరాలు.. 

ఒడిశా సీఎస్ ప్రదీప్ కుమార్ జెనా మాట్లాడుతూ.. నైనీ ప్రాజెక్టు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన సహకారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. అటవీ భూమిని త్వరగా అప్పగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

తర్వాత బలరాం ఒడిశా ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఇడ్కో) చైర్మన్ హేమంత్ శర్మ ను కలిశారు. నైనీ గనికి 50 కిలోమీటర్ల దూరంలో 1,600 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయనకు తెలిపారు. సింగరేణి బృందం ఒడిశాలో నాలుగు ప్రదేశాలను పరిశీలించిందని.. 800 ఎకరాల భూమి అవసరం ఉంటుందని వివరించారు.

ఆ భూములకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు. దీనిపై స్పందించిన హేమంత్ శర్మ.. సింగరేణి పరిశీలించిన స్థలాలపై ఇడ్కో సీజీఎం(ల్యాండ్) సరోజ్ కుమార్ సేథీతో మాట్లాడారు. సింగరేణికి సహకారం అందించాలని సూచించారు. తర్వాత బలరాం ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సుశాంత్ నందాను కలిశారు. అటవీ భూమిని బదలాయించాలని కోరగా సుశాంత్ సానుకూలంగా స్పందించారు. బలరాం మాట్లాడుతూ.. అటవీ భూమి బదలాయింపు జరిగితే 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుందని తెలిపారు.