సింగరేణి: కొత్త గనుల్లో ‘ప్రైవేట్’ తవ్వకం!

సింగరేణి: కొత్త గనుల్లో ‘ప్రైవేట్’ తవ్వకం!
  • ఒడిశాలోని నైనీ బొగ్గు ప్రాజెక్ట్ పనులను కాంట్రాక్ట్ కు ఇచ్చిన సింగరేణి
  • కొత్తగూడెం వీకే ఓసీలో పనులు కూడా కేటాయింపు  
  • ఉత్పత్తి  ఖర్చు తగ్గించుకునేందుకే అంటున్న సింగరేణి యాజమాన్యం
  • ప్రైవేటీకరణను అంటుకుంటామంటున్న కార్మిక సంఘాలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొత్త ఓపెన్​కాస్ట్​గనుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రైవేట్ కాంట్రాక్టర్లరగ అప్పగించడంపై  సింగరేణి దృష్టి పెట్టింది. ఇప్పటికే ఒడిశాలోని నైనీ ఓసీలో బొగ్గు తవ్వకం పనులను ఇచ్చింది. మరో మూడు నెలల్లో కొత్తగూడెంలో ప్రారంభించే వీకే ఓసీలో కొంత బొగ్గు తవ్వే పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కేటాయించింది. ఆగస్టులో మొదలయ్యే ఇల్లెందులోని పూసపల్లి ఓసీలోనూ బొగ్గు తవ్వక పనులను ప్రైవేట్ భాగస్వామ్యంతో చేసేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. మరోవైపు సింగరేణి నిర్ణయాన్ని తప్పుపడుతూ.. కార్మిక సంఘాలు  ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. 

ఆందోళన బాటలో కార్మిక సంఘాలు

గతంలో ఇల్లెందు ఏరియా కోయగూడెం ఓసీలో బొగ్గు తవ్వే పనులను కాంట్రాక్టర్​కు ఇచ్చినప్పుడు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలు చేశాయి. ఇప్పుడు కూడా సింగరేణి చర్యలపై మండిపడుతున్నాయి.  ఇప్పటికే  గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ ఆందోళనలు చేపట్టాయి.  

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలోనే భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​యూనియన్​అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కె. రాజ్​కుమార్,​ యూనియన్​ గౌరవ అధ్యక్షుడు,  కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.  ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడాన్ని అడ్డుకోవడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలం చెందిన హెచ్​ఎమ్మెస్​అధ్యక్షుడు రియాజ్​అహ్మద్​, సింగరేణి కాలరీస్​ఎంప్లాయీస్​యూనియన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహరావు ఆరోపించారు. త్వరలోనే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ప్రైవేట్ కు బొగ్గు తవ్వే పనులు ఇవ్వొద్దంటూ..

ఈ నెలలోనే ఒడిశాలోని నైనీ ఓపెన్​కాస్ట్​ప్రాజెక్ట్​ను ప్రారంభించి..  వచ్చే నెలలో బొగ్గు తవ్వకాలకు సింగరేణి ప్లాన్​ చేసింది. తొలి ఏడాది 4 – 5 మిలియన్​ టన్నులు, అనంతర కాలంలో 10 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనుంది. కొత్తగూడెంలోని వీకే ఓసీని వచ్చే మే, జూన్​లో మొదలుపెట్టి, ఆగస్టులో బొగ్గు ఉత్పత్తి చేపట్టనుంది.  ఇక్కడ 183 మిలియన్​ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. 

ఇందులో 80 లక్షల టన్నుల బొగ్గు వెలికితీత పనులను కాంట్రాక్టర్​కు కట్టబెట్టగా.. దీని జీవిత కాలం 40 ఏండ్లు.  బొగ్గు తవ్వుతూనే భవిష్యత్ లో మరికొంత బొగ్గు తవ్వే పనులను సింగరేణి  కాంట్రాక్టర్లకు​ఇవ్వనుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇల్లెందు పూసపల్లి ఓసీ పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకే ఆసక్తి చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవాలంటే ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి అని సింగరేణి పేర్కొంటుంది. అలా చేయకుంటే పోటీ మార్కెట్​లో తట్టుకోలేని పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.