
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న ఆఫీసర్లకు కోల్ ఇండియాలో లాగా ఫెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) చెల్లించేలా చూడాలని అసెంబ్లీలో ప్రస్తావించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సింగరేణి ఆఫీసర్లు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ జనరల్సెక్రటరీ పెద్ది నర్సింహులు, వైస్ ప్రెసిడెంట్పొనుగోటి శ్రీనివాస్, ఇతర డెలిగేట్లు పాల నరేశ్, జి.రామకృష్ణ, కొండి శంకరయ్య, మొలుమూరి తిరుపతి, జి.శ్రావణ్‌కుమార్, ఎన్.యశ్వంత్ కుమార్.. తదితరులు వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వివేక్ వెంకటస్వామి సింగరేణి ఆఫీసర్ల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
'మత్స్య అభివృద్ధి మండలి' ఏర్పాటు చేయాలి
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి శ్రీరామ్ సాగర్ వరకు సుమారు 175 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ, నది గర్భంలో నిల్వ ఉన్న నీటి వనరులను (బ్యాక్ వాటర్స్) ఉపయోగించుకుని ఒక ప్రత్యేక ‘మత్స్య అభివృద్ధి మండలి’గా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ కోరారు. ఈ మేరకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
మత్స్య అభివృద్ధి మండలి’ ఏర్పాటుచేస్తే గోదావరికి ఇరువైపులా చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వేలాదిమంది మత్స్యకారులతో పాటు అదనంగా మరో 35 వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.