10 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలి : శ్రీనివాస్

  • సింగరేణి అధికారుల సమీక్షలో నిర్ణయం  

గోదావరిఖని, వెలుగు : దేశ వ్యాప్తంగా విద్యుత్, ఇతర పరిశ్రమలకు బొగ్గు అవసరాల దృష్ట్యా సింగరేణి సంస్థ 100 మిలియన్  టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సిన అవసరం ఉందని సింగరేణి పర్సనల్, ఆపరేషన్స్ డైరెక్టర్  ఎన్వీకే శ్రీనివాస్  పేర్కొన్నారు. అన్ని రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి సీఎండీ ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం ఆర్జీ–1 ఏరియా గోదావరిఖని ఇల్లందు క్లబ్​లో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాల వృద్ధి, వివిధ రంగాల్లో విస్తరణ అంశాలపై నిర్వహించిన వర్క్ షాప్​లో ఆయన మాట్లాడారు.

అన్నిరంగాల్లో 10 శాతం వృద్ధి సాధించడంతో పాటు 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్  టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సౌర, జియో థర్మల్  ఉత్పత్తిపై కూడా ముందుకెళ్లాలన్నారు. పీఅండ్​పీ డైరక్టర్  జి వెంకటేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ 100 మిలియన్  టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతీ ఉద్యోగికి అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్పత్తి వ్యయం తగ్గించి, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసేలా కృషి చేయాలన్నారు.

ఈఅండ్ఎం డైరెక్టర్  సత్యనారాయణ మాట్లాడుతూ దేశ అవసరాల రీత్యా సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఈ వర్క్ షాప్​లో జీఎంలు చింతల శ్రీనివాస్, ఎల్వీ సూర్యనారాయణ, ఎన్  సుధా రావు, కె వెంకటేశ్వర్లు, ఎస్డీ హబీబ్ హుస్సేన్, రవి ప్రసాద్, సంజీవ రెడ్డి, మనోహర్, రవి కుమార్, ఎస్ఓటూ జీఎం రాంమోహన్  పాల్గొన్నారు.