- కొత్తవి ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ వినతి
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని కేకే-–5, కాసీపేట-–1, 2 అండర్ గ్రౌండ్ మైన్లలోని కాలం చెల్లిన ఎస్డీఎల్ మెషీన్లను నడపలేక సింగరేణి ఆపరేటర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేశ్, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్ చెప్పారు. కొత్తవి ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం ఆయా గనుల మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలం చెల్లిన ఎస్డీఎల్ మెషీన్లను నడపడం ఆపరేటర్లకు కష్టంగా ఉందని, బొగ్గు టార్గెట్ పూర్తిచేయలేకపోతున్నారని చెప్పారు. ఫలితంగా మందమర్రి ఏరియాలో నష్టాలు పెరిగిపోతున్నట్లు తెలిపారు. రిపేర్లు చేయించి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని, కొత్తవి కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. అలాగే ఎస్డీఎల్ ఆపరేటర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. 10 ఏండ్లుగా ఆపరేటర్లుకు ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. కొత్త రూఫ్ బోల్టులు ఏర్పాటు చేయాలని, మందమర్రి ఎంవీటీసీ నుంచి కేకే5 మైన్వరకు రోడ్డు నిర్మించాలని కోరారు.