సింగరేణిలో హాజరుపై నజర్!

సింగరేణిలో హాజరుపై నజర్!
  • డ్యూటీలకు వెళ్లని కార్మికులకు షోకాజ్ నోటీసులు
  • కుటుంబ సభ్యులు సమక్షంలోనూ కౌన్సెలింగ్ 
  • తీరు మార్చుకోని 105 మందికి యాజమాన్యం డిస్మిస్​ లెటర్లు 

గోదావరిఖని/ కోల్ బెల్ట్, వెలుగు :  సింగరేణివ్యాప్తంగా విధులకు గైర్హాజర్ అయ్యే కార్మికులపై యాజమాన్యం నజర్ పెట్టింది. ఇప్పటికే సరిగా డ్యూటీలకు రాని వారికి ముందుగా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అనంతరం కార్మికుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ చేసింది. అయినా.. తీరు మార్చుకోకపోవడంతో  యాజమాన్యం తీవ్ర నిర్ణయం తీసుకుంది. విధులకు డుమ్మా కొట్టే కార్మికులకు చివరకు డిస్మిస్ లెటర్లను సింగరేణి అధికారులు జారీచేశారు. 

100 మస్టర్లలోపు ఉన్న వారికి కౌన్సెలింగ్ 

సింగరేణివ్యాప్తంగా వివిధ బొగ్గు గనులు, ఓపెన్​కాస్ట్​ల్లో పనిచేసే కార్మికుల్లో ఎవరైనా ఏడాదిలో100లోపు మస్టర్లు (హాజరు) ఉన్నవారికి యాజమాన్యం కౌన్సెలింగ్ చేసింది. ఇలా సింగరేణి వ్యాప్తంగా మొత్తంగా 1,204 మంది ఉన్నారు. వీరిలో కొత్తగూడెంలో 80, ఇల్లందులో 12 , మణుగూరులో 39, కొత్తగూడెం  కార్పొరేట్​లో 01, ఆర్జీ –1 ఏరియాలో 138, ఆర్జీ –2 ఏరియాలో 71, ఆర్జీ –3 ఏరియాలో 18, అడ్రియాల ప్రాజెక్ట్​ ఏరియాలో 84, బెల్లంపల్లిలో 05, మందమర్రిలో 199, శ్రీరాంపూర్​లో 395, భూపాలపల్లిలో 162 మంది చొప్పున ఉన్నారు. వీరిలో చాలా మందిని ఇప్పటికే పలుమార్లు పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ చేశారు.  

105 మందికి డిస్మిస్ నోటీసు​లు జారీ

బొగ్గు గనుల్లో  పనిచేసేందుకు జాబ్ లో చేరిన అనం తరం పరిస్థితుల కారణంగా డ్యూటీకి పూర్తిగా హాజరు కాని కొత్తగూడెం, రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలకు చెందిన 105 మం దికి యాజమాన్యం​ డిస్మిస్​ నోటీలను జారీ చేసింది. అంతకు ముందు మూడు సార్లు వార్నింగ్​ లెటర్లు ఇచ్చి, పలుమార్లు కౌన్సెలింగ్ చేసినా మార్పు రాకపోగా లాస్ట్ చాన్స్ గా పేర్కొంటూ నోటీసులు పంపింది. అయితే నోటీస్ ​అందిన 45 రోజుల్లోపు సంజాయిషీ లెటర్​ ఇస్తే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని యాజమాన్యం తెలిపింది.

డిపెండెంట్లలో ఎక్కువగా హయ్యర్ స్టడీస్ చదివినవారే..

సింగరేణిలో బొగ్గు గనుల్లో డ్యూటీలు చేసేందుకు ఇటీవల కార్మికులు ఎగనామం పెడుతున్నారు. కౌన్సెలింగ్ చేసినా తీరు మార్చుకోకపోతుండగా తొలగించే దాకా తెచ్చుకుంటున్నారు. కార్మికుడు మరణించినా, అనారోగ్యానికి గురైనా డిపెండెంట్​కింద వారసులకు జాబ్ లు ఇచ్చారు. డిపెండెంట్ల జాబ్ ల్లో జాయిన్ అయినవారిలో చాలా మంది ఉన్నత చదువులు చదివి, సిటీలో సాఫ్ట్ వేర్​జాబ్   చేసిన వారున్నారు. ఆధునిక జీవితానికి అలవాటు పడినవారు, బొగ్గు గనుల్లో పని చేయడం కష్టంగా భావిస్తున్నారు. గనుల్లో రాత్రి షిప్ట్​డ్యూటీలు చేయడం కూడా ఇష్టం లేక వెళ్లలేదని తెలుస్తుంది. అండర్ గ్రౌండ్ మైన్లలో పనిచేసే వారిలో కొందరు అనారోగ్యానికి గురైతే సర్ఫేస్​లో చేసేందుకు డిప్యూటేషన్​పై చాన్స్ ఇస్తారు. కానీ యాజమాన్యం  ఇటీవల దీన్ని నిలిపివేయడంతో జాబ్ చేసే వెసులుబాటు లేకుండా పోయింది. 

కౌన్సెలింగ్ ఓకే.. తొలగించొద్దు 

 సింగరేణిలో డ్యూటీలకు గైర్హాజర్ అయ్యే కార్మికులకు కౌన్సెలింగ్ మాత్రమే చేస్తుండాలి. కానీ జాబ్ నుంచి తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయి. అనారోగ్యానికి గురైన కార్మికుల వారసులకు అవకాశం కల్పించాలి. గనుల్లో పనిచేసేలా యువ కార్మికుల్లో అవగాహన తీసుకురావాలి. అలాకాకుండా జాబ్ లోంచి తొలగిస్తే మిగతా వారిలో అభద్రతాభావం నెలకొంటుంది.   – వి.సీతారామయ్య, ప్రెసిడెంట్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ